Share News

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. వివాదాలతో సహవాసం

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:37 AM

విద్యార్థి నాయకుడిగా ప్రశ్నపత్రాల లీకేజీపై ఉద్యమించి నిర్మించుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. అదే పేపర్‌ లీకేజీలపై జెన్‌జీ చేసిన పోరాటంతో అప్రతిష్ఠ పాలైంది....

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. వివాదాలతో సహవాసం

మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రయాణం

న్యూఢిల్లీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థి నాయకుడిగా ప్రశ్నపత్రాల లీకేజీపై ఉద్యమించి నిర్మించుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. అదే పేపర్‌ లీకేజీలపై జెన్‌జీ చేసిన పోరాటంతో అప్రతిష్ఠ పాలైంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. పుష్కర కాలంగా కేంద్ర మంత్రిగా వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించిన ధరేంద్ర ప్రధాన్‌ ప్రయాణం ఆది నుంచి వివాదాలమయమేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలోని సంబల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ 2021 జూలై నుంచి 2026 జూలై 25 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. బిహార్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి వ్యూహరచన చేసిన ఆయన విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. రోజుల తరబడి కార్యాలయానికి వచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. ధరేంద్ర ప్రధాన్‌ 2014లో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2017లో క్యాబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొంది 2021 వరకు ఆ శాఖలో కొనసాగారు. 2017-24వరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిగా, 2019-21 వరకు కేంద్ర ఉక్కు మంత్రిగా కూడా పని చేశారు.

పెట్రోలియం మంత్రిగా వివాదాల ప్రస్థానం

ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై రాజకీయ ఆరోపణలు, వివాదాలు తలెత్తాయి. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్‌ 10 రోజుల విదేశీ పర్యటనకు సంబంధించి దాదాపు రూ.70 వేల అంతర్జాతీయ ఫోన్‌ బిల్లును ప్రభుత్వ నిధులతో నడిచే పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ సంస్థ చెల్లించిందనే ఆరోపణలు వచ్చాయి. వ్యాపమ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు సుధీర్‌శర్మ డబ్బులతో ధర్మేంద్ర ప్రధాన్‌ విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ధర్మేంద్ర ప్రధాన్‌ సోదరుడు సౌమేంద్ర ఒడిశాలో నిర్వహిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీపై 2017లో ఒడిశా విజిలెన్స్‌ శాఖ దాడులు చేసి చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ మంత్రిగా ఉన్నప్పుడు 2015లో పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి అత్యంత రహస్యమైన పత్రాలు చోరీకి గురై కార్పొరేట్‌ కంపెనీల చేతికి చిక్కాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్‌) నిధుల వినియోగానికి సంబంధించి కూడా ప్రధాన్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.


ఆయన పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు 2019-20లోనే సుమారు 9 చమురు సంస్థలు దాదాపు రూ.350 కోట్లను ఒడిశాలోనే ఖర్చు చేశాయి. ప్రధాన్‌ ఆ శాఖ నుంచి తప్పుకున్నాక ఈ నిధులు భారీగా పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సంఘ్‌ పరివార్‌ అనుబంధ సంస్థలకు చెందిన ఆస్పత్రులు, పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా రూ.670 కోట్లు మళ్లించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా, ధరేంద్ర ప్రధాన్‌ కేంద్ర విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ)ని విజయవంతంగా అమలు చేయడం ఆయన పదవీకాలంలో కీలక పరిణామం. పీఎం శ్రీ కింద దేశ వ్యాప్తంగా 13 వేలకు పైగా పాఠశాలలను మోడల్‌ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఉపాధ్యాయలు నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి సమగ్ర శిక్ష 3.0 ప్లాగ్‌ షిప్‌ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేశారు. విద్యార్థులకు ప్రాథమిక విద్యలో మాతృభాష, బహుభాషా విధానాన్ని ధరేంద్ర ప్రధాన్‌ బలంగా ప్రోత్సహించారు.

మళ్లీ స్వరాష్ట్ర రాజకీయాలపై గురి!

ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్‌ స్వరాష్ట్రంలో బలమైన నేత. ఆ రాష్ట్రంలో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి పదవి రేసులో ధర్మేంద్ర ప్రధాన్‌ పేరు బలంగా వినిపించింది. 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా.. ధర్మేంద్ర ప్రధాన్‌ సీఎం కావడం ఖాయమనే అంతా అనుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం మోహన్‌ చరణ్‌ మోఝేకు సీఎం బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగించింది. నీట్‌ వివాదంతో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ తిరిగి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 04:37 AM