Share News

గత పది రోజులుగా ఎంతో కలత చెందాను

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:25 AM

కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ఽరాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రదాన్‌ శనివారం తన భావోద్వేగాలను దేశ యువతతో పంచుకున్నారు. ఈ మేరకు వారిని ఉద్దేశిస్తూ రాసిన లేఖను...

గత పది రోజులుగా ఎంతో కలత చెందాను

  • యువత దుష్ప్రచారాల వలలో పడొద్దు

  • దేశ వ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ఎక్స్‌లో ప్రధాన్‌

  • ఎక్స్‌లో యువతకు ధర్మేంద్ర ప్రధాన్‌ బహిరంగ లేఖ

న్యూఢిల్లీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ఽరాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రదాన్‌ శనివారం తన భావోద్వేగాలను దేశ యువతతో పంచుకున్నారు. ఈ మేరకు వారిని ఉద్దేశిస్తూ రాసిన లేఖను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. రాజీనామా తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో చిక్కుకోనివ్వనని, ఇదే తన సంకల్పమని ప్రకటించారు. జంతర్‌ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలన్న ఉద్దేశంతో, దేశ ఐక్యత నిలకడగా ఉండాలనే ఆకాంక్షతో, దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే లక్ష్యంతో,విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనలతో మంత్రి పదవికి రాజీనామా చేశానని వివరించారు. దేశ ప్రజాస్వామ్య శక్తిపై ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నానని తెలిపారు. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదని, వికసిత భారత్‌ నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులని చెప్పారు. యువశక్తే భారత్‌కు అసలైన బలమన్నారు. మే 3న జరిగిన నీట్‌ పరీక్షలో అక్రమాలు బయట పడ్డాయని, కేంద్రం వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును సీబీఐకి అప్పగించిందని చెప్పారు. నీట్‌ పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్ష తేదీని ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో జూన్‌ 21న నీట్‌ను నిర్వహించామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీట్‌ లీకేజీ ఘటనకు మొదటి రోజు నుంచే బాధ్యత వహించానన్నారు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. జూలై 16న ప్రకటించిన నీట్‌ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, అనేక మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పని చేశానని ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశానికి సేవ చేసేందుకు ఎప్పటికీ అంకితభావంతో సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 04:25 AM