యూపీకి 140.. తెలంగాణకు 25
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:24 AM
నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోబోమని.. అన్ని రాష్ట్రాలకూ గంపగుత్తగా 50 శాతం మేర సీట్లు పెంచుతామని కేంద్రం లీకులిచ్చినా..
జనాభా ప్రాతిపదికనే పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే
ప్రస్తుతం 543 సీట్లలో ఉన్న ప్రాతినిధ్యం కన్నా తక్కువ స్థానాలు
2011 జనాభా లెక్కల ప్రకారమే జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ లాభం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోబోమని.. అన్ని రాష్ట్రాలకూ గంపగుత్తగా 50 శాతం మేర సీట్లు పెంచుతామని కేంద్రం లీకులిచ్చినా.. పలువురు బీజేపీ నేతలు అదే మాట చెప్పినా.. ముసాయిదా బిల్లులో మాత్రం ఆ విషయం లేదు! 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరపనున్నట్టు పేర్కొన్నారు. ఆ లెక్క ప్రకారమే డీలిమిటేషన్ జరిపితే.. ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా లాభపడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న 543 సీట్లకు గాను.. దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఉదాహరణకు.. తమిళనాడు రాష్ట్రానికి ప్రస్తుతం 39 సీట్లున్నాయి. 543 సీట్లకుగాను 39 సీట్లు అంటే.. 7.18 శాతం ప్రాతినిధ్యం. పెరగనున్న 850 సీట్లకు అదే 7.18 శాతం దామాషాలో సీట్లు రావాలంటే.. తమిళనాడులో లోక్‌సభ స్థానాల సంఖ్య 61 కావాలి. కానీ.. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిపితే తమిళనాడు సీట్ల సంఖ్య 51కి చేరుతుంది. అంటే.. 10 సీట్లు తక్కువ వస్తాయి. అందుకే స్టాలిన్ దీన్ని అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే 50 శాతం మేర పెంచితే మాత్రం.. 59 సీట్లు వస్తాయి. అంటే.. ప్రస్తుత దామాషా ప్రకారం చూసుకుంటే 2 సీట్లు మాత్రమే తగ్గుతాయి. అప్పటికి కూడా నష్టమేగానీ.. జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్‌తో పోలిస్తే చాలా తక్కువ నష్టం. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీకి ప్రస్తుత దామాషా ప్రకారమే సీట్లు పెరిగితే 39 స్థానాలు వస్తాయి. అదే 50 శాతం మేర పెంచితే 38 వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారమైతే 35 మాత్రమే వస్తాయి. తెలంగాణకు ప్రస్తుత దామాషా ప్రకారమైతే 27 సీట్లు రావాలి. కానీ.. 50 శాతం పెంపుతో 26 సీట్లు, అదే 2011 జనాభాలెక్కల ప్రకారమైతే 25 సీట్లే వస్తాయి.
అంటే.. జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే అది తెలుగు రాష్ట్రాలకు నష్టమే. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే.. దక్షిణాదిన మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కేరళం పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ప్రస్తుత దామాషా ప్రకారం ఆ రాష్ట్ర స్థానాలు పెరగాలంటే.. 20 నుంచి 31 కావాలి. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచితే కేవలం 23 సీట్లే వస్తాయి. అదే 50 శాతం పెంపు అయితే.. 30 సీట్లు వస్తాయి. ఇదే క్రమంలో.. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే ఒడిశా కూడా 4 సీట్ల మేర నష్టపోతుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం.. జనాభా లెక్కల ప్రకారం జరిగితేనే లాభం. ఉదాహరణకు.. యూపీకి 50 శాతం చొప్పున పెరిగితే 120 సీట్లే వస్తాయి. 2011 లెక్కల ప్రకారమైతే.. 140 వస్తాయి. ఉత్తరాదిన మిగతా రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి.
యోగంద్రయాదవ్ లెక్క..
లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం ప్రకారం పెంచాల్సిన సీట్లు.. 2011 జనాభా లెక్కల ప్రకారం పెరిగే సీట్లను బేరీజు వేస్తే బీమారు (ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్) రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందుతాయని ప్రముఖ సామాజిక వేత్త యోగేంద్ర యాదవ్ విశ్లేషించారు. ఆయన లెక్కల ప్రకారం... జనాభా ప్రాతిపదికనే పునర్విభజన జరిగితే ఈ 4రాష్ట్రాలకూ ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న ప్రాతినిధ్యం కన్నా అధికంగా 35 సీట్లు పెరిగి ఉత్తరాది ప్రాబల్యం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో..దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు గరిష్టంగా 11, కేరళ 8, ఆంధ్రప్రదేశ్ 5, తెలంగాణ 3, కర్ణాటక 2 సీట్లు నష్టపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ప్రస్తుత వాటా ప్రకారం సీట్ల పెరుగుదల లేకపోవడం వల్ల ఈ రాష్ట్రాలు 29 సీట్లు కోల్పోతాయన్నారు.