పునర్విభజనకు కేంద్రం మళ్లీ రెడీ!
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:45 AM
ఏ పరిస్థితుల్లోనూ 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి తీరాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో...
ఏకాభిప్రాయ ప్రక్రియకు శ్రీకారం
తొలుత ప్రాంతీయ పార్టీలతో మొదలు
డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, ఉద్ధవ్ సేనలతో చర్చలు
న్యూఢిల్లీ, జూన్ 4: ఏ పరిస్థితుల్లోనూ 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి తీరాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెడుతూ తీసుకొచ్చిన బిల్లు లోక్‌సభలో వీగిపోయినప్పటికీ.. దీనిపై ముందుకే వెళ్లాలని భావిస్తోంది. అయితే మళ్లీ బిల్లు తెచ్చే విషయంలో హడావుడి పడకుండా.. మొదట రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలని నిర్ణయించింది. ప్రాంతీయ పార్టీలతో చర్చలకు శ్రీకారం చుట్టింది. డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, ఉద్ధవ్ శివసేనలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఈ సంఖ్యను ఖరారు చేశారు. ఇప్పుడు దానిని మార్చడం ఆషామాషీ కాదు. వివిధ రాష్ట్రాల ప్రాతినిధ్యం సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా నియంత్రణ సమర్థంగా చేసిన రాష్ట్రాలు.. ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాపై కసరత్తు చేస్తోంది. అన్ని రాష్ట్రాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాల పరిష్కారంపై దృష్టి సారిస్తోంది. ఈ ప్రక్రియకు చట్టరూపం తెచ్చేందుకు విస్తృత ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారుచేయాలని భావిస్తోంది. ప్రాంతీయ పార్టీలతో ప్రారంభించిన చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పక్షాలన్నిటితో సంప్రదింపులు పూర్తయి.. విస్తృత అంగీకారం ఏర్పడితే.. అప్పుడు బిల్లుపై ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తుందని తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఎజెండాలో మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులను తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాం: కె.కేశవరావు
Read Latest TG News And Telugu News