పిల్లిని కాపాడ్డానికి వెళ్లి.. ఐసీయూలో ప్రాణాలకోసం పోరాటం..
ABN , Publish Date - Jun 14 , 2026 | 07:35 AM
పిల్లిని కాపాడ్డానికి మంటల్లోకి వెళ్లి.. ఓ మహిళ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ఇంటర్‌నెట్ డెస్క్: పిల్లిని కాపాడ్డానికి మంటల్లోకి వెళ్లి.. ఓ మహిళ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున 2.24 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీ, తుగ్లకాబాద్‌లో ఐదంతస్తుల బిల్డింగ్‌లో ఎలక్ట్రికల్ షార్ట్ షర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు అత్యంత వేగంగా పై అంతస్తులకు వ్యాపించసాగాయి. మంటల కారణంగా మెట్ల మార్గం మూసుకుపోయింది.
లోపల చిక్కుకుపోయిన వారు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడసాగారు. ఇలాంటి సమయంలో ముంతాజ్ అనే మహిళ ధైర్యం చేసింది. తన కుటుంబసభ్యులను కాపాడ్డానికి పూనుకుంది. తన ఇద్దరు చెల్లెళ్లు కరీనా, సీమాలను మంటల నుంచి బయటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత పెంపుడు పిల్లి కోకో కోసం మంటల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమె లోపల చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన ముంతాజ్‌ను బయటకు తీసుకువచ్చారు.
ముంతాజ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై ముంతాజ్ తల్లి కిశ్వర్ జహాన్ మాట్లాడుతూ.. ‘నా పిల్లలకే ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. నేను నిద్రలో ఉన్నాను. మా ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. అర్థరాత్రి ఆయన నిద్రలేచి.. ఫోన్ మోగుతోందని చెప్పాడు. నేను కాల్ లిఫ్ట్ చేశాను. నా కూతురు భయంతో.. అమ్మా నన్ను కాపాడు అని ఏడుస్తోంది. ఏమైందని అడిగాను. బిల్డింగ్ మంటల్లో చిక్కుకుందని చెప్పింది. ప్రాణాలతో బయటపడలేమని అంది. అక్కడి జనం కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉన్నారు’ అని చెప్పుకొచ్చింది.