Share News

సోనియా ఓటు-పౌరసత్వం కేసులో ఆ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు యాంత్రికం

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:59 AM

భారత పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పేరు చేర్చిన వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీజేఎం) సరైన ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారని స్పష్టంచేసింది.

సోనియా ఓటు-పౌరసత్వం కేసులో  ఆ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు  యాంత్రికం
soniaGandhi

  • సరైన ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారు

    ఢిల్లీ స్పెషల్‌ కోర్టు స్పష్టీకరణ

  • ఏసీజేఎం కోర్టు ఉత్తర్వులు రద్దు

  • ఫిర్యాదును తాజాగా విచారించాలని నిర్దేశం

  • తదుపరి విచారణ 29వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: భారత పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పేరు చేర్చిన వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీజేఎం) సరైన ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారని స్పష్టంచేసింది. సోనియాగాంధీకి 1983లో భారత పౌరసత్వం లభించగా.. 1980 లోక్‌సభ ఎన్నికల్లోనే న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ ఓటరుగా ఓటరు జాబితాలో ఆమె పేరుందని.. ఇదెలా జరిగిందో దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. సెంట్రల్‌ ఢిల్లీ కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వికాస్‌ త్రిపాఠి ఏసీజేఎం కోర్టును ఆశ్రయించారు. అయితే మేజిస్ట్రేట్‌ ఆ ఫిర్యాదును కొట్టివేశారు. ధ్రువీకరించని 1980 ఓటర్ల జాబితా ఫొటోకాఫీకి ఫొటోకాపీ ఆధారంగా.. నిరాధార ఆరోపణలతో ఫిర్యాదు చేశారని.. మోసం, ఫోర్జరీ వివరాలు అందులో లేవనిపేర్కొన్నారు. ఈ ఆదేశాలు యాంత్రికంగా ఉన్నాయని స్పెషల్‌ కోర్టు జడ్జి విశాల్‌ గోగ్నీ సోమవారం తప్పుబట్టారు. ‘కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధంగా ఉండాలి. వాస్తవాలను తేలికగా తీసుకోకూడదు. సోనియాగాంధీకి భారత పౌరసత్వం రావడానికి మూడేళ్లకు ముందే ఆమె పేరు 1980లో న్యూఢిల్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో చట్టవిరుద్ధంగా చేరిందని.. 1982లో ఆ పేరు తొలగించినా 1983లో మళ్లీ చేర్చారని వికాస్‌ త్రిపాఠి కంప్లయింట్‌ ఇచ్చారు. 1983 ఏప్రిల్‌ 30న ఆమెకు భారత పౌరసత్వం లభించిందని.. ఓటరు జాబాతాలో ఆమె పేరు తిరిగి చేర్చేనాటికి పౌరసత్వం రాలేదని అందులో పేర్కొన్నారు.


పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా ప్రతి పౌరుడికీ పవిత్రమైనది. దేశంలో అతి శక్తిమంతుడైనా అతి సామాన్య పౌరుడిలా ఓటరు మాత్రమే. ఓటరు జాబితాను తారుమారు చేశారని.. మోసపూరితంగా ఓటరు పేరు చేర్చారని.. పౌరుడు కాని వ్యక్తి పేరు చేర్చారని.. తప్పుడు ధ్రువీకరణలు, తప్పుడు డాక్యుమెంట్లు ఉపయోగించి ఉండొచ్చని.. మోసం, ఫోర్జరీ జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టు సహేతుకమైన ఉత్తర్వులివ్వాలి. సోనియాగాంధీ పేరును ఎప్పుడు చేర్చారు.. ఎప్పుడు తొలగించారు.. ఎప్పుడు తిరిగి చేర్చారో కాలక్రమంపై ఎలాంటి చర్చనూ మేజిస్ట్రేట్‌ రికార్డు చేయలేదు. ఈ ఆరోపణలు గుర్తించదగిన నేరం కిందకు వస్తాయో రావో తేల్చకుండా.. సదరు కంప్లయింట్‌లో అవసరమైన అంశాలు లేవని తేల్చేశారు’ అని ఆక్షేపించారు. 1980నాటి ఓటర్ల జాబితాను వెలికితీసి ఆరోపణలను పరిశీలించాలని.. లేదంటే మోసపూరితంగా సోనియాగాంధీ పేరును అందులో చేర్చడంపై దర్యాప్తునకు ఆదేశించాలని మాత్రమే ఫిర్యాదులో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ కేసులో న్యాయపరంగా జరిగిన స్పష్టమైన తప్పు కనిపిస్తోందన్నారు. ‘తన ఎదుట ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం.. సెక్షన్‌ 223 ప్రకారం ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాల పరిశీలన అనే రెండు ఆప్షన్లు ఉన్నా మేజిస్ట్రేట్‌ పట్టించుకోలేదు. సదరు ఫిర్యాదును కేంద్రప్రభుత్వ పరిధిలోని పౌరసత్వం వ్యవహారంతో కలిపేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం.. తొలగించడానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారం.. తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు పొందడంపై పోలీసులు దర్యాప్తు జరపకుండా నిషేధిస్తోందని మేజిస్ట్రేట్‌ ఎలా భావించారో మాకు అంతుచిక్కడం లేదు’ అని స్పెషల్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సహేతుక ఉత్తర్వులు జారీచేసేందుకు వీలుగా త్రిపాఠి ఫిర్యాదును తిరిగి ఏసీజేఎం కోర్టుకు పంపారు. సదరు కంప్లయింట్‌పై తాజాగా వాదనలు వినాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు బుల్డోజర్లతో స్వాగతం

సాహిల్ సూసైడ్ కేసు.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాంబే యాజమాన్యం

Updated Date - Sep 22 , 2026 | 02:59 AM