పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ అనుమతి కోరలేదు
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:07 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం (20న) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ (నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్‌కు తరలిరావడం) కార్యక్రమానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు...
ప్రదర్శనలు నిర్వహిస్తే కఠిన చర్యలు.. ఢిల్లీ పోలీసుల ప్రకటన
నేతలు హామీ ఇస్తే నేడే దీక్ష విరమణ.. వాంగ్‌చుక్ భార్య గీతాంజలి
జంతర్‌మంతర్‌కు భారీగా యువత.. 20 వేల మంది వచ్చారు: సీజేపీ
ఢిల్లీ పోలీసుల ప్రకటన.. భారీగా భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీ, జూలై 19: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం (20న) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ (నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్‌కు తరలిరావడం) కార్యక్రమానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అసలు అనుమతి కోరుతూ తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. ఢిల్లీ జిల్లా వ్యాప్తంగా బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్ 163 కింద నిషేధిత ఉత్తర్వులు అమల్లోకి తెస్తూ.. నిరసన ప్రదర్శనలు, సమావేశాలు, మార్చ్ నిర్వహిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ ఎక్స్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతుండడం, అదే రోజు పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని సీజేపీ తలపెట్టడంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిజర్వ్ పోలీసు బలగాలను రంగంలోకి దింపడం, బహుళ అంచల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతోపాటు.. వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూసేందుకు జంతర్‌మంతర్ వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కనౌట్ ప్లేస్, శంకర్ చౌక్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

జంతర్‌మంతర్‌కు చేరుకుంటున్న యువత
సీజేపీ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి ఒకరోజు ముందు జంతర్‌మంతర్‌కు భారీ సంఖ్యలో యువత చేరుకుంది. సుమారు 20,000 మంది చేరుకున్నట్టు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్ ఎక్స్‌లో పోస్ట్ చేశా రు. ప్రముఖ నటులు షబానా అజ్మి, ప్రకాశ్‌రాజ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఎం నేత బృందా కరాత్, ఆప్ నేత మనీష్ సిసోడియా తదితరులు జంతర్ మంతర్‌ను సందర్శించి సీజేపీ ఉద్యమానికి మద్దతు పలికారు.
హామీ ఇస్తే దీక్ష విరమిస్తారు..
ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కీలక ప్రకటన చేశారు. రాజకీయ నేతలు సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో వాంగ్‌చుక్‌ను కలసి, విద్యావ్యవస్థలో జవాబుదారీ కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పట్టుబడతామని హామీ ఇస్తే సోమవారమే తన భర్త దీక్ష విరమిస్తారని ప్రకటించారు.
వాంగ్‌చుక్‌ను నిర్బంధించలేదు: ఢీల్లీ హైకోర్టు
నీట్-2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో.. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం బలవంతంగా ఆస్పత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆయన్ను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చర్యను నిరంకుశమైనదిగా చూడరాదని పేర్కొంది. జూన్ 28 నుంచి దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో, ఢిల్లీ పో లీసులు అత్యవసరంగా శనివారం ఆయన్ను అంబులెన్స్‌లో సఫ్జర్‌జంగ్ ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఆధ్వర్యంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఆదివారం విచారణ నిర్వహించింది. వాంగ్‌చుక్‌ను నిర్బంధించి.. ఆయన ఇష్టానికి వ్య తిరేకంగా చికిత్స చేస్తున్నారన్న వాదనలను తోసిపుచ్చింది. కాగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై సిరా పోసిన మహిళ.. బర్ఖా త్రెహాన్ తన చర్యను సమర్థించుకున్నారు. హిందూ దేవుళ్లను దీప్కేతోపాటు ఆయన అనుచరులు అవమానించారని.. అవహేళనగా మాట్లాడారని అందుకే తాను సిరా పోసి నిరసన వ్యక్తం చేశానన్నారు. దీప్కే చేపట్టిన శాంతియుత నిరసనకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు.
రెండో స్వాతంత్య్ర ఉద్యమం
తనను అన్యాయంగా నిర్బంధించారని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి ఒక లేఖను విడుదల చేశారు. తాను ఇప్పటికీ నిరాహార దీక్షలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. దీన్ని రెండో స్వాతంత్య్ర ఉద్యమంగా అభివర్ణించారు. సోమవారం (20న) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!