జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు బ్రేక్!
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:05 AM
దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరోసారి ‘శాంతియుత’ నిరసనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దానిని నిరసన ప్రాంతంగా తొలగించారు.
దశాబ్దాల ప్రదర్శన వేదికను తొలగించిన ఢిల్లీ పోలీసులు
సీజేపీ, విపక్షాల ఆందోళనలతోనే?..
ప్రత్యామ్నాయంగా 3 ప్రాంతాల ఎంపిక
ఇకపై రామ్‌లీలా మైదానం, సీబీడీ గ్రౌండ్, బురారీ గ్రౌండ్‌లోనే నిరసనలు
కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ ఆగ్రహం.. నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
మరో నెలదాకా పారామిలిటరీ నీడలో ఢిల్లీ.. 20 వేల మంది మోహరింపు
న్యూఢిల్లీ, అక్టోబరు 12: దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరోసారి ‘శాంతియుత’ నిరసనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దానిని నిరసన ప్రాంతంగా తొలగించారు. మూడు దశాబ్దాలకుపైగా నిరసనలు, ప్రదర్శనలకు వేదికగా కొనసాగుతున్న జంతర్ మంతర్‌లో ఇకపై నిరసనలకు అవకాశం లేదని ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదానం, సీబీడీ గ్రౌండ్, బురారీ గ్రౌండ్‌లలో నిరసనలు చేపట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై సీజేపీ, కాంగ్రెస్ పార్టీ మండిపడ్డాయి. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఆమోదించేది లేదని సీజేపీ పేర్కొనగా.. ప్రజాస్వామ్యమంటే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు లెక్కలేదని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. నీట్ పేపర్ లీకులకు బాధ్యత వహించి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 25 వరకు సీజేపీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఈ నెల 10న కూడా సీజేపీ జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే పోలీసులు దానిని అణచివేశారు. ఈ నేపథ్యంలో జంతర్‌మంతర్ వద్ద మరోసారి శాంతియుత నిరసనకు అనుమతించాలని.. తేదీలు సూచించాలని సౌరవ్‌దాస్ నేతృత్వంలోని సీజేపీ బృందం సోమవారం పార్లమెంటు స్ట్రీట్ పోలీసులను కోరింది. అయితే జంతర్‌మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుంచి డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ ఆదివారమే ఆదేశాలిచ్చారు. కేంద్ర హోం శాఖ ఏర్పాటుచేసిన కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
జంతర్‌మంతర్ నుంచి అవెంత దూరం?
సెంట్రల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం జంతర్‌మంతర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో, సీబీడీ గ్రౌండ్ (తూర్పు ఢిల్లీ) 13.5కిమీ, బురారీ గ్రౌండ్ (ఉత్తర ఢిల్లీ) 44కిమీ దూరాన ఉంటాయి. మరోవైపు.. జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రదర్శనలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని పోలీసులు చూపలేదని పిటిషనర్ ఆరోపించారు. దీనిని అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. మంగళవారం విచారణ చేపడతామని వెల్లడించింది. ఢిల్లీలో నిరసనలపై దాఖలైన పిటిషన్‌ను కూడా మంగళవారమే విచారిస్తామని తెలిపింది. ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు ముందుందని గుర్తుచేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ రామ్‌లీలా మైదానాన్ని నిరసనలకు వేదికగా ఎంపిక చేయడాన్ని వ్యాపార, రవాణా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత ఢిల్లీలోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లన్నీ ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాయని.. ఇక్కడ నిరసనలు చేపడితే వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జంతర్‌మంతర్‌ను నిరసనల వేదికగా తొలగించడాన్ని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) స్వాగతించింది. గత వారమే దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశామని తెలిపింది.
మరో నెల పాటు పారామిలిటరీ నీడలో ఢిల్లీ
20 వేల మంది సిబ్బంది మోహరింపు
దేశ రాజధానిలో 20 వేల మంది పారామిలిటరీ జవాన్ల మోహరింపును మరో నెలపాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పండుగల సీజన్ కావడంతో ఢిల్లీ మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జనసమూహం పెరిగే అవకాశముందని.. అదీగాక సీజేపీ, విపక్షాలు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నందున.. వేల మంది ఢిల్లీ పోలీసులకు తోడు పారామిలిటరీ బలగాలను కూడా కొనసాగించాలని నిశ్చయించినట్లు అధికార వర్గాలు తెలిపాయుు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్దఎత్తున వాహన తనిఖీలు, హోటళ్లు, గెస్ట్‌హౌ్‌సలు, లాడ్జీలు, ధర్మశాలల్లో సోదాలు జరుగుతున్నారు
ఈ వార్తలు కూడా చదవండి
ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి
పూంచ్‌లో భారీ పేలుడు.. నలుగురు ఉగ్రవాదులు మృతి!