హాస్టల్ కూలిన ఘటన.. శిథిలాల కింద నుంచి లొకేషన్ షేర్ చేసి..
ABN , Publish Date - Sep 10 , 2026 | 02:33 PM
ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఓ యువకుడు నాటి భయానక అనుభవం గురించి పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన దేశవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. నాటి భయానక అనుభవం గురించి ఓ యువకుడు జాతీయ మీడియాతో పంచుకున్నాడు. తమ వాట్సాప్ లొకేషన్‌ను తన స్నేహితుడు ఇతర ఫ్రెండ్స్‌కు షేర్ చేయడంతో తాము బయటపడగలిగామని చెప్పాడు. ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భవనం కూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆ ఇద్దరినీ సహాయక సిబ్బంది గంటన్నర వ్యవధిలోనే బయటకు తీసుకురాగలిగారు.
తాను అప్పుడే భోజనం చేసి గదిలో కూర్చుని ఉండగా భవనం అకస్మాత్తుగా కూలిపోయిందని నితేశ్ ఛిబ్ తెలిపాడు. అతడు ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భవనం కూలడంతో స్నేహితులిద్దరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ‘నా శరీరం మొత్తం మొద్దుబారిపోయినట్టు అనిపించింది. అసలు స్పర్శే తెలియలేదు. రక్తస్రావం అవుతున్నట్టు అనిపించింది. ఆసుపత్రిలో చేరాకే నాకు పూర్తిస్థాయిలో స్పృహ వచ్చింది’ అని నితేశ్ తెలిపారు. ఆ తరువాత యువకులు తమ వాట్సాప్ లొకేషన్ షేర్ చేసిన గంటన్నరకు సహాయక సిబ్బంది వచ్చి వారిని శిథిలాల కింద నుంచి బయటకు తీసుకొచ్చారు.
అసలు భవనం అలా కూలిపోతుందని తాము కలలో కూడా అనుకోలేదని నితేశ్ తెలిపాడు. ‘భవనం అంత బలహీనంగా ఉందని మాకు తెలియదు. భవనం కూలుతుందనేలా గోడల్లో పగుళ్లు, ఇతర సంకేతాలు ఏవీ లేవు. బేస్‌మెంట్‌లో నిర్మాణపనులు జరుగుతున్నాయని మాత్రం తెలుసు. ఇంతలో భవనం కూలిపోయింది’ అని అతడు అన్నాడు. ఢిల్లీలో తనలాంటి ఎందరో విద్యార్థులకు హాస్టల్స్ తప్ప మరో వసతి సౌకర్యం ఉండదని చెప్పాడు. కాబట్టి, నిబంధనలు పక్కాగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే భవన యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భవనం పాతబడిపోయిందని, పునాదులు బలహీనంగా ఉన్నాయని తెలిసీ వారు అద్దెలకు కక్కుర్తి పడి అదనపు అంతస్తులు నిర్మించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆస్తి కోసం కొడుకు చేసిన కుట్రలకు సుప్రీంకోర్టు చెక్.. తల్లి కాళ్లు పట్టుకోమని ఆదేశం..
ఏఐ ఫేక్ వీడియోలతో మోసాలు.. ప్రజలకు ప్రియాంక గాంధీ ఆఫీస్ హెచ్చరిక..