Share News

ఢిల్లీ మద్యం కేసు మాయ.. మిథ్య!

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:34 AM

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా......

ఢిల్లీ మద్యం కేసు మాయ.. మిథ్య!

  • కేజ్రీవాల్‌, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్‌చిట్‌

  • సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

  • కేజ్రీవాల్‌పై చేసిన ఆరోపణలు ప్రధానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనే సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలోని ఒకే ఒక వాక్యంపై ఆధారపడి ఉన్నాయి. ‘కవిత మిమ్మల్ని సంప్రదిస్తారు’ అని దాదాపు 10-12 మంది సమక్షంలో చెప్పినట్టు ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. అయినా వారిని విచారించలేదు. సాక్షులుగా చేర్చలేదు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఆర్థిక లావాదేవీల మూలాలు, ఇతర స్వతంత్ర సాక్ష్యాల మద్దతు లేనంతవరకూ.. ఇలాంటి వాంగ్మూలాలు కేవలం వినికిడి సమాచారంగానే మిగిలిపోతాయి.

  • పలు కేసులలో, ప్రధాన నేరంపై దర్యాప్తు ముగియకముందే, కేవలం డీఫాల్ట్‌ బెయిల్‌ రాకుండా అడ్డుకోవడానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగుతోంది. దీనివల్ల పీఎంఎల్‌ఏ విచారణ ప్రారంభమవుతుంది కానీ, అసలు నేరంపై దర్యాప్తు అసంపూర్తిగా ఉండిపోతోంది. అసలు నేరం లేనప్పుడు మనీలాండరింగ్‌ నేరం స్వతంత్రంగా నిలబడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పీఎంఎల్‌ఏ నేరం స్వతంత్రమైనది కాదు. అది చట్టబద్ధంగా నిలబడే అసలు నేరంతో ముడిపడి ఉంటుంది. పునాది కూలిపోతే దానిపై కట్టిన భవనం కూడా కూలిపోక తప్పదు.

- జడ్జి జితేంద్ర సింగ్‌

  • సీబీఐని కడిగి పారేసిన రౌజ్‌ అవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్‌

  • కేసు, దర్యాప్తు మొత్తం తప్పుల తడక

  • ముందే నిర్ణయించుకుని ఊహల ఆధారంగా కేసు నమోదు

  • అక్కడా ఇక్కడ విన్న మాటల ఆధారంగా కేసును నిర్మించారు

  • కేజ్రీవాల్‌, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదు

  • రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపైసమాచారం లేకుండా నిందితుడిగా చేర్చడం రూల్‌ ఆఫ్‌ లాకే విరుద్ధం

  • మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్‌ను కుట్రలో ఇరికించారు

  • అప్రూవర్ల మాటలనే పరమ సత్యాలుగా సీబీఐ భావించింది

  • ఇలాంటి కేసును అల్లినందుకు దర్యాప్తు అధికారినే విచారించాలి

  • జడ్జి జితేంద్రసింగ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందినీ నిర్దోషులుగా తేల్చింది.


అభియోగాల నమోదు దశలోనే అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ రెడ్డి, బుచ్చిబాబు గోరంట్ల, ముత్తా గౌతమ్‌ సహా ఈ కేసులో నిందితులందరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ‘‘ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసు.. చేసిన విచారణ.. 12 శాతం హోల్‌సేల్‌ మార్జిన్‌తో కుప్పలు తెప్పలుగా లాభాలు వచ్చిపడిపోతాయనే సీబీఐ సిద్ధాంతం మొత్తం తప్పుల తడక. ఆర్థిక అంశాలపై అక్షరం ముక్క రానివాళ్లు చేసినట్లుంది. చట్టపరంగా ఏమాత్రం నిలవదు’’ అని తేల్చి చెప్పింది. సౌత్‌ గ్రూప్‌కు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రయత్నించారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌ తప్పు చేశారని నిరూపించేందుకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా అక్రమంగా ఆయన లబ్ధి పొందారని చెప్పడానికి ఏదైనా ఒక పత్రం కానీ, ఫైల్‌ నోట్‌ కానీ, ఎలకా్ట్రనిక్‌ కమ్యూనికేషన్‌ కానీ, ఆర్థిక లావాదేవీని కానీ సాక్ష్యాధారంగా చూపలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు రౌజ్‌ ఎవెన్యూ కాంప్లెక్స్‌లోని సీబీఐ కోర్టు స్పెషల్‌ జడ్జి జితేంద్ర సింగ్‌ శుక్రవారం సంచలన తీర్పును వెలువరించారు. 598 పేజీల తన తీర్పులో సీబీఐ, ఈడీలను ఆయన కడిగి పారేశారు. ఇది ఎందుకూ పనికిరాని కేసు అని, న్యాయ సమీక్షకు అస్సలు నిలవదని తేల్చి చెప్పారు. ‘‘సీబీఐ సమర్పించిన మొత్తం రికార్డును 2 నెలలకుపైగా వడపోశాం. వందలాది పేజీలతో రూపొందించిన చార్జిషీటు, ఇతర పత్రాలను పరిశీలించాం. దాదాపు 300మంది సాక్షులను విచారించాం. పార్టీల వాదనలు అన్నిటినీ విన్నాం. చివరికి మాకు అనిపించింది ఏమిటంటే.. కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా సీబీఐ చూపలేదు. నిందితులకు వ్యతిరేకంగా తీవ్రమైన సందేహాన్ని లేవనెత్తలేదు. ఈ మాట చెప్పడానికి మేం సంకోచించడం లేదు. అందుకే, ఈ కేసులో ఆరోపించిన అన్ని నేరాల నుంచి నిందితులందరినీ విముక్తులను చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. దర్యాప్తులో అనేక లొసుగులున్నాయని, చార్జిషీటులో తప్పుదోవ పట్టించే అంశాలున్నాయని తప్పుబట్టారు. ‘‘ఒక్క సాక్షి ప్రకటనను కూడా సీబీఐ పక్కాగా చేర్చలేకపోయింది. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా కేజ్రీవాల్‌, సిసోడియా సహా అనేక మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుల్‌దీప్‌ సింగ్‌. అసలు ఆయనను మొదటి నిందితుడిగా ఎందుకు చేర్చారో సీబీఐ చెప్పలేకపోయింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ సేకరించలేదు’’ అంటూ జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మద్యం విధానాన్ని మనీశ్‌ సిసోడియా రూపొందించారని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు చూపలేదని స్పష్టం చేశారు. చార్జిషీటులో ఎన్నో అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయని, ఫలితంగా, మద్యం స్కాంలో కుట్ర జరిగిందని సీబీఐ తేల్చలేకపోయిందని వ్యాఖ్యానించారు. ‘‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కేజ్రీవాల్‌ వంటి వ్యక్తిని నిర్దిష్ట సమాచారం లేకుండా కేసులో నిందితుడిగా చేర్చడం రూల్‌ ఆఫ్‌ లాకే విరుద్ధం. ఆయనకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ ప్రకటన చేయలేదు. సాక్ష్యాలూ సమర్పించలేదు. అటువంటప్పుడు ఆయనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఎలా చెప్పగలరు!?’’ అని జడ్జి ప్రశ్నించారు. ఏదో భారీ, సంక్లిష్టమైన కుట్ర ఉందన్న భావన కల్పించేందుకు ఏమాత్రం పొంతన లేని అంశాలను అతుకుల బొంత మాదిరిగా కుట్టారని తప్పుబట్టారు.


కేసు నేపథ్యం ఇదీ..

ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం 2021 నవంబరులో కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రీటైల్‌ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకొంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేటు లైసెన్సుదారులకు అనుమతిచ్చింది. కొత్త పాలసీతో లిక్కర్‌పై ఆదాయం 27శాతం పెరిగిందని, 8,900 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానాన్ని బీజేపీ తప్పుబట్టింది. పాలసీలో ఉల్లంఘనలు ఉన్నాయని, ప్రైవేటు లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని ఆరోపించింది. దీనిపై ఢిల్లీ సీఎస్‌ ఓ నివేదిక ఇచ్చారు. ప్రైవేటు వ్యాపారులకు ప్రభుత్వం రూ.144 కోట్ల మేర లైసెన్సు ఫీజు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే, మద్యం పాలసీపై సీబీఐ విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సిఫారసు చేశారు. కేంద్ర హోం శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌ రాయ్‌ ిసీబీఐకి ఫిర్యాదు చేశారు. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు లంచాల కోసం కుట్రపూరితంగా పాలసీలో మార్పులు చేశారని, హవాలా లావాదేవీలు జరిపారని, ఎన్నికల్లో ఖర్చు కోసం ఆ డబ్బును వినియోగించారని ఆరోపించింది. దాంతో, 2022 నవంబర్‌ 24న సీబీఐ ప్రధాన చార్జిషీటును దాఖలు చేసింది. కేసును విచారించిన సీబీఐ 23 స్పెషల్‌ జడ్జి జితేందర్‌ సింగ్‌ తుది తీర్పును వెలువరించారు.

అన్నీ ఊహలే.. ఆధారాల్లేవ్‌

మద్యం విధానం రూపకల్పనలో ఏ విధమైన అక్రమాలు జరగలేదని జడ్జి జితేందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. వివిధ శాఖలు, నిపుణుల కమిటీలతో చర్చించి క్యాబినెట్‌ స్థాయిలో ఆమోదాలు పొందిన తర్వాతే నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇచ్చి పుచ్చుకోవడం, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించి రుజువులు సమర్పించనంత వరకు ఎలాంటి ఆరోపణలకు పస ఉండదని స్పష్టం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నరే ఈ విధానానికి ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. ‘‘కేవలం ఊహల ఆధారంగా సీబీఐ ఈ కేసును తీర్చిదిద్దింది. చట్టపరంగా ఆమోదించే ఆధారాలేమీ లేవు. ఈ కేసును లాజికల్‌గా, పక్కాగా పెట్టాలని సీబీఐ భావించింది. కానీ, ముందే వచ్చిన నిర్ణయం మేరకే ఆధారాలను సమకూర్చుకుందని న్యాయ సమీక్షలో తేలిపోయింది. అతుకుల బొంత చార్జిషీటులో ఊహలతోనే ఖాళీలను పూరించుకునే బాధ్యతను కోర్టుకు అప్పగించింది. కానీ, చట్టప్రకారం ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ కేసులో సీబీఐ తీరు తప్పుల తడక. ఆర్థిక అంశాల్లో పూర్తి నిరక్షరాస్యత. చట్టపరంగా నిలవదు. ప్రభుత్వ విధానాలను అమలు చేసేటప్పుడు అధికారులు రొటీన్‌గా అధికారిక విధులు నిర్వర్తిస్తారనే వాస్తవాన్ని దర్యాప్తు అధికారి విస్మరించారు. రూల్‌ ఆఫ్‌ లా పునాదులపైనే దాడి చేశారు. నేరం జరిగిందని వాళ్లు ముందే అనుకుని ఆ భావనతో దర్యాప్తు చేశారు. సాధారణ ఆర్థిక లావాదేవీలను కూడా నేరంగా చూపాలని చూశారు. ఎన్నికల ప్రచారంలో చేసిన ఖర్చులను కూడా ఆడిట్‌ చేసేసి.. ఎన్నికల కమిషన్‌ పాత్రను కూడా సీబీఐ పోషించేసింది’’ అని తీవ్రంగా తప్పుబట్టింది.


మాగుంట ప్రకటనతో కేజ్రీని ఇరికిస్తారా?

నాలుగో అదనపు చార్జిషీటును 2024 జూలైలో సమర్పించారని, చివరి దశలో కేజ్రీవాల్‌ను నిందితుడిగా చేర్చారని కోర్టు తప్పుబట్టింది. ‘‘మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా ఇచ్చిన ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్‌ను కుట్రలో భాగం చేశారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు నన్ను సంప్రదిస్తారని మాగుంట చెప్పిన మాట ఆధారంగానే ఆయనను ఇరికించారు.తర్వాతే ఆయన్ని 18వ నిందితుడిగా చేర్చారు. ఆ ఒక్క ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్‌ను ఎలా ఇరికిస్తారు?’’ అని కోర్టు ప్రశ్నించింది. సౌత్‌ గ్రూప్‌కు ప్రయోజనాలు చేకూర్చేందుకే విధానాన్ని మార్చడంలో కేజ్రీవాల్‌ కీలక పాత్ర పోషించారని చెప్పేందుకు సీబీఐ తీవ్ర ప్రయత్నాలు చేసిందని తప్పుబట్టింది.

అప్రూవర్ల ప్రకటనలు నమ్మలేం

‘‘అప్రూవర్లు చెప్పిన మాటలనే సీబీఐ పరమ సత్యాలుగా నమ్మింది. కనీసం వాటిని వెరిఫై కూడా చేసుకోలేదు. అప్రూవర్ల ప్రకటనలు విశ్వసనీయం కాదు. వాటిని నిర్ధారించుకోలేం. రాఘవ, మాగుంట వంటి వారి ప్రకటనలను పరిగణనలోకి తీసుకోలేం. వాటికి డాక్యుమెంటరీ సాక్ష్యాలేమీ లేవు. అక్కడా ఇక్కడ విన్న మాటల ఆధారంగా కేసును నిర్మించారు’’ అంటూ సీబీఐని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కేజీఆర్‌ఎల్‌ కంపెనీకి మాగుంట గ్రూప్‌కు చెందిన జనబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్లు బదిలీ చేయడం.. తర్వాత దానిని తిరిగి చెల్లించడం చూస్తే ఎలాంటి కుట్రకు ఆస్కారం లేదని వ్యాఖ్యానించింది. రుణాన్ని తిరిగి చెల్లించినంత మాత్రాన దానిని సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. నగదు బదిలీకి, మనీశ్‌ సిసోడియాకు మధ్య సంబంధం ఉన్నట్లు రుజువు చేయలేకపోయారని స్పష్టం చేసింది. సౌత్‌ గ్రూప్‌ తరఫున విజయ్‌ నాయర్‌ (ఏ3) మనీశ్‌ సిసోడియాతో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇండో స్పిరిట్స్‌కు చెందిన సమీర్‌ మహేంద్రు (ఏ7) మద్యం విధాన రూపకల్పన అమల్లో కుట్రకు పాల్పడ్డారని, తద్వారా హోల్‌సేల్‌ లైసెన్సు పొందారని చెప్పేందుకు కూడా సాక్ష్యాలు లభించలేదని తెలిపింది. హోల్‌సేల్‌ డీలర్ల మార్జిన్‌ను 12 శాతం మేరకు పెంచినంత మాత్రాన దాన్ని కుట్రగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ 12 శాతం మార్జిన్‌ ఆర్థికంగా లాభసాటి కూడా కాదని వ్యాఖ్యానించింది. సౌత్‌ గ్రూప్‌కు లబ్ధి చేకూర్చడానికే ఈ మార్జిన్‌ను పెంచారని ఆరోపించడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. పాత, కొత్త విధానాలను పోల్చి విశ్లేషించడంలో కూడా సీబీఐ విఫలమైందని కోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా ‘అన్యాయం ఎక్కడ జరిగినా న్యాయానికి ప్రతిచోట ముప్పు ఏర్పడినట్లే’ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ మాటలను జడ్జి ఉటంకించారు.


విధాన నిర్ణయాలపై కేసు పెట్టి దర్యాప్తు చేయరాదు

అవినీతి అక్రమాలు చేయాలనే ఉద్దేశమో లేదా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఆధారమో లేకుండా కేవలం విధాన నిర్ణయాలకు ఆమోదం తెలపడాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌కు ఆర్థికంగా లబ్ధి చేకూరిందని చెప్పడానికి పత్రాల రూపంలో కానీ ఎలకా్ట్రనిక్‌ రూపంలో కానీ ఆధారాలను చూపలేకపోయిందని సీబీఐని తప్పుబట్టారు. ‘‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో, విధాన నిర్ణయాల్లో మార్పులు సర్వసాధారణం. సంక్షేమ పథకాల అమలుకు, ఆదాయాన్ని పెంచుకోవడానికి అనివార్యం కూడా. ఆశించిన ఫలితాలు రాలేదనో.. ప్రైవేటు భాగస్వాములు లాభాలు ఆర్జిస్తున్నారనో నిర్ధిష్ట పథకంపై కేసు పెట్టి దర్యాప్తు చేయరాదు. సదుద్దేశంతో తీసుకున్న ఆర్థిక, పరిపాలనాపరమైన నిర్ణయాలను ఎటువంటి ఆధారాలు లేకుండా నేరంగా పరిగణించరాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

  • అప్పట్లో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. అయినా.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా రెండు విడతల్లో 156 రోజులపాటు సీబీఐ ఆయనను తీహార్‌ జైల్లో పెట్టింది. అయితే, లంచం తీసుకున్నారని, పరస్పర ప్రయోజనం (క్విడ్‌ ప్రో కో) పొందారనడానికి ఆధారాల్లేకుండానే సీబీఐ ఆయనను అరెస్టు చేసి, జైల్లో పెట్టిందని ఇప్పుడు న్యాయస్థానం తేల్చింది!

  • మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అంటూ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సీబీఐ ఏకంగా 530 రోజులపాటు అంటే.. దాదాపు ఏడాదిన్నర జైల్లో ఉంచింది! కానీ, ఆయన నిందితుడంటూ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సీబీఐ, ఈడీ చూపలేదని రౌజ్‌ ఎవెన్యూ కోర్టు తేల్చి చెప్పింది!

  • మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా గోవా ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చారని అప్పటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది! దాదాపు 165 రోజులపాటు ఆమెను తీహార్‌ జైల్లో ఉంచింది! కానీ, కవిత దోషి అని చెప్పేందుకు సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపలేదని కోర్టు ఇప్పుడు స్పష్టం చేసింది!


మద్యం కేసులో ఎప్పుడు ఏం జరిగింది?

  • 2021, నవంబరు

ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించింది.

  • 2022, జూలై

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో అవినీతి, అక్రమాలతో పాటు మనీలాండరింగ్‌ కూడా జరిగిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేశారు.

  • 2022, ఆగస్టు

ఎక్సైజ్‌ పాలసీలో అవినీతి ఆరోపణలపై సీబీఐ (ఆగస్టు 17), మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ (ఆగస్టు 22) కేసులు నమోదు చేశాయి. ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు విచారణ ప్రారంభించింది.

  • 2022, సెప్టెంబరు

ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీని రద్దు చేసింది

  • 2023 అక్టోబరు - 2024 మార్చి

ఈ 5 నెలల కాలంలో మనీలాండరింగ్‌ కేసుపై ఈడీ కేజ్రీవాల్‌కు 9సార్లు సమన్లు జారీ చేసింది.

  • 2024, మార్చి 21

ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అంతకుముందు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ కేజ్రీవాల్‌ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

  • 2024, మే 10

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు 2024, జూన్‌ 1వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

  • 2024, జూన్‌ 20

మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు (రౌజ్‌ అవెన్యూ కోర్టు) కేజ్రీవాల్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

  • 2024, జూన్‌ 21

ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ట్రయల్‌ కోర్టు ఆర్డర్‌ను సస్పెండ్‌ చేసింది. దీంతో, కేజ్రీవాల్‌ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

  • 2024 జూన్‌ 26

జైల్లోనే ఉన్న కేజ్రీవాల్‌ను ఎక్సైజ్‌ పాలసీలో అవినీతి కేసులో సీబీఐ అధికారికంగా అదుపులోకి తీసుకుంది.

  • 2024 , జూలై 12

ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసులో బెయిల్‌ రాని కారణంగా ఆయన జైల్లోనే ఉన్నారు

  • 2024, జూలై 17

సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.

  • 2024, ఆగస్టు 5

సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది

  • 2024, అగస్టు12

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించారు.

  • 2024, సెప్టెంబరు 13

సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే బెయిల్‌ వచ్చి ఉండటంతో కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల అయ్యారు.

  • 2026, ఫిబ్రవరి 12

ఎక్సైజ్‌ పాలసీలో అక్రమాలకు సంబంధించి మొదటి నుంచీ విచారణ జరుపుతున్న ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

  • 2026, ఫిబ్రవరి 27

ఢిల్లీ ట్రయల్‌ కోర్టు ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌, సిసోడియా, కవిత సహా 23మందిపై ఉన్న కేసులను కొట్టివేసింది

Updated Date - Feb 28 , 2026 | 06:15 AM