Share News

ఢిల్లీలోని హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం..21 మంది ఆహుతి

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:03 AM

దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌ ప్రాంతంలో ఫ్లోరిష్‌ స్టే హోటల్‌లో భారీగా మంటలు చెలరేగి 21 మంది అగ్నికి ఆహుతి అయ్యారు...

ఢిల్లీలోని హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం..21 మంది ఆహుతి

11 మంది విదేశీయులు, 10 మంది ఇక్కడివారు..

న్యూఢిల్లీ, జూన్‌ 3: దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌ ప్రాంతంలో ఫ్లోరిష్‌ స్టే హోటల్‌లో భారీగా మంటలు చెలరేగి 21 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. అందులో వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన 11 మంది విదేశీయులు కూడా ఉన్నారు. సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని చూసేందుకు వచ్చిన బంధువులు కూడా మృత్యువాత పడ్డారు. ఇరుకైన రోడ్డులోని ఐదంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఈ హోటల్‌లో బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయి. క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది, స్థానికులు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 58 మందిని హోటల్‌ నుంచి బయటికి తీసుకొచ్చారు. వారిని ఆస్పత్రులకు తరలించేలోపే అందులో 21మంది మరణించారు. 19 మంది పరిస్థితి విషమంగా ఉంది.. మరికొందరి ఆచూకీ లభించడం లేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొంత మంది భవనంపై నుంచి దూకడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిప్రమాదంలో మృతిచెందినవారిలో 9మంది ఆఫ్రికా దేశాల వారు, ఇద్దరు తుర్క్‌మెనిస్థాన్‌ వారు, మిగతా 10 మంది భారతీయులు ఉన్నారు. సహాయక ఆపరేషన్‌లో పాల్గొన్న పది మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..


కారణంపై అస్పష్టత!

హోటల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌ సిబ్బంది 8.20 గంటల సమయంలో వచ్చారు. వంటగదిలోకి వెళ్లి ఎలక్ట్రిక్‌ పరికరాలను ఆన్‌ చేశారు. కాసేపటికే పేలుడు వంటి శబ్ధం వినిపించింది. వెంటనే మంటలు చెలరేగాయి. దీనికి కచ్చితమైన కారణం ఏమిటనేది ఇంకా గుర్తించలేదు. ప్రమాదం జరిగిన ‘ఫ్లోరిష్‌ స్టే బ్రెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌’ హోటల్‌ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ హోటల్‌కు కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇరుకైన ఐదంతస్తుల భవనంలో 25 గదులతో నిర్వహిస్తున్నారు. భవనంలోని బేస్‌మెంట్‌లోనూ గదులు నిర్మించి, వినియోగిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెస్టారెంట్‌ కొనసాగుతోంది. పై అంతస్తుల్లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వేగం గా స్పందించి, చాలా మంది ప్రాణాలను కాపాడారు. ఫైర్‌, విపత్తు నిర్వహణ సిబ్బంది వచ్చే లోపే సహాయక చర్యలు చేపట్టారు. గట్టిగా అరుస్తూ ఎటువైపు నుంచి బయటపడాలనే సూచనలు చేశారు. హోటల్‌ నుంచి బయటికి వచ్చిన కొందరు బాధితులకు సీపీఆర్‌ చేశారు. ఆస్పత్రికి తరలించారు. సమీపంలో పరుపుల దుకాణం ఉన్న రియాజుద్దీన్‌ అనే వ్యాపారి స్థానికులతో కలిసి పరుపులను తీసుకొచ్చి భవనం వద్ద పరిచారు. దీనితో కొందరు పైనుంచి కిందకి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఒక మహిళ తన బిడ్డను పట్టుకుని మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. వారు పరుపులపైనే పడినా స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ఢిల్లీ హోటల్‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ‘ఎక్స్‌’లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయం అందిస్తామని మోదీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి సహాయక నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున,క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున సహాయం అందిస్తామని తెలిపారు.

ముగ్గురిపై కేసు నమోదు

అగ్నిప్రమాద ఘటనపై ‘కల్పబుల్‌ హోమిసైడ్‌(నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించి ప్రాణాలు పోవడానికి కారణమైన)‘ సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హోటల్‌ను ముగ్గురు భాగస్వాములు నిర్వహిస్తున్నారని, భవన యజమాని లవ్‌కేశ్‌ అని, జైమిశ్రా అనే వ్యక్తి పేరిట హోటల్‌ లైసెన్సు ఉండగా, లోకేశ్‌ బజాజ్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. వారు పరారీలో ఉండటంతో లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. లవ్‌కేశ్‌ను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 06:04 AM