ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటన.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:23 AM
ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటనలో ఓ వీధి వ్యాపారి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటనలో ఓ వీధి వ్యాపారి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. భవనం కూలడానికి కొన్ని క్షణాల ముందు ముంచుకొస్తున్న ముప్పును గ్రహించి తప్పించుకోగలిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాల ప్రకారం, ఓ వ్యక్తి భవనం పక్కనే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో తలపైకెత్తి చూశాడు. భవనం కూలిపోతున్న విషయం గమనించగానే క్షణాల్లో అప్రమత్తమైన అతడు అక్కడి నుంచి పరుగు తీశాడు. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అతడు అక్కడి నుంచి కదిలిన మరుక్షణమే భవనం కూలిపోయింది. పెద్ద ఎత్తున దుమ్మూధూళి పైకి లేచింది.
పోలీసు వర్గాల కథనాల ప్రకారం, ఆ భవనాన్ని హాస్టల్‌గా వినియోగిస్తున్నారు. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్నాయి. బేస్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం కూలిపోయిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మరణించారు. శిథిలాల కింద మరో 50 మంది వరకూ చిక్కుకుని ఉంటారని సహాయసిబ్బంది భావిస్తున్నారు. ఇప్పటికే 11 మందిని కాపాడారు. మిగిలిన వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కూలిన ఢిల్లీ హాస్టల్ భవనం.. శిథిలాల కింద చిక్కుకుని వీడియో కాల్
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి