Share News

సిసోడియా అవినీతిని నిరూపించే కనీస ఆధారాలు కూడా లేవు

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:34 AM

ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 విధానం రూపొందించేటప్పుడు ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై ప్రాసిక్యూషన్‌ చేసిన ఆరోపణలను రౌస్‌ ఎవెన్యూ కోర్టు...

సిసోడియా అవినీతిని నిరూపించే కనీస ఆధారాలు కూడా లేవు

  • ప్రాసిక్యూషన్‌ ఆరోపణలపై రౌస్‌ ఎవెన్యూ కోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 విధానం రూపొందించేటప్పుడు ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై ప్రాసిక్యూషన్‌ చేసిన ఆరోపణలను రౌస్‌ ఎవెన్యూ కోర్టు విశ్లేషించింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు పాలసీ విధానాన్ని మద్యం వ్యాపారానికి అనుకూలంగా ఆయన మార్చేశారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పరిశీలించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి, క్విడ్‌ ప్రో కో, నిజాయితీ లేని ఉద్దేశం ఉంటే తప్ప పాలసీ విధానాలు నేరపూరితమైనవి కాబోవని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆంతరంగిక ఫైళ్లు, పాలసీ డ్రాఫ్టులు, అధికారుల చర్చల ఆధారంగానే ప్రాసిక్యూషన్‌ కేసు ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే ఇవన్నీ సాధారణ పరిపాలనలో భాగమని, వీటన్నింటినీ నేరపూరితమైనవిగా భావిస్తూ ఆధారాలుగా పేర్కొన్నారని కోర్టు అభిప్రాయపడింది. మద్యం విధానం వల్ల ప్రైవేట్‌ పార్టీలకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగినంత మాత్రానే అవినీతికి నిదర్శనమని చెప్పలేమంది. అక్రమ లావాదేవీలు జరిగితేనే నేరంగా భావించాలంది. మద్యం విధానాలపై లంచాలకు, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ వద్ద కనీస ఆధారాలు కూడా లేవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 05:34 AM