ట్రక్కు ఢీకొని గో సంరక్షుడు ఫర్సా వాలే బాబా మృతి.. మథురలో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:50 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శనివారంనాడు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గో సంరక్షకుడు చంద్రశేఖర్ మృతిని ఖండిస్తూ స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గోవుల స్మగ్లింగ్‌ను అనుమానించి ఒక ట్రక్కును వెంబడిస్తుండగా అది ఆయన బైకును ఢీకొట్టిందని స్థానికులు ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శనివారంనాడు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గో సంరక్షకుడు చంద్రశేఖర్ మృతిని ఖండిస్తూ స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గోవుల స్మగ్లింగ్‌ను అనుమానించి ఒక ట్రక్కును వెంబడిస్తుండగా అది ఆయన బైకును ఢీకొట్టిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనలో ఫర్సా వాలే బాబా (Farsa wale Baba)గా పేరున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో కోసి కలాన్ ఏరియాలో జాతీయ రహదారిని గో సంరక్షకులు దిగ్బంధించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ-ఆగ్రా రహదారిపై ఆందోళనలు చోటుచేసుకోవడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు, వారి వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ ఘటనపై మథుర ఎస్ఎస్‌పీ మాట్లాడుతూ.. గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో కంటైనర్ ట్రక్కును బాబా అడ్డుకున్నారని, దట్టమైన మంచు కారణంగా ఆయన బైక్‌ను ట్రక్కు ఢీకొందని తెలిపారు. ట్రక్కులో వైర్లు, రేషన్ సరకులు ఉన్నాయని, డ్రైవర్, హెల్పర్‌ను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. గోవుల స్మగ్లింగ్‌తో ఈ ఘటనకు సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదని, రోడ్డు ప్రమాదంగానే కనిపిస్తోందని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు.
ఘటనపై యోగి ఆదిత్యనాథ్ స్పందన
ఫార్సా వాలే బాబా మృతికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు. తక్షణమే ఘటనా స్థలికి వెళ్లి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 'నేరస్థుల ప్రమేయం ఏమాత్రం ఉన్నా క్షమించి విడిచిపెట్టేది లేదు' అని సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం
విమాన టికెట్ల ధరలపై కేంద్రం దృష్టి.. ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తాం: రామ్మోహన్ నాయుడు