ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కామెంట్స్‌పై స్పందించిన దావూద్ గ్యాంగ్
ABN , Publish Date - Jun 04 , 2026 | 09:51 PM
దావూద్ గ్యాంగ్ తనను బెదిరించిందంటూ ఐపీఎల్ చీఫ్ లలిత్ మోదీ ఇటీవల చేసిన కామెంట్స్‌పై గ్యాంగ్ కీలక సభ్యుడు ఛోటా షకీల్ స్పందించాడు. తాము ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్‌లకు ప్రయత్నించలేదని షకీల్ స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: దావూద్ గ్యాంగ్ తనను బెదిరించిందంటూ ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కామెంట్స్‌పై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ గ్యాంగ్ తొలిసారిగా స్పందించింది. లిలిత్ మోదీని హత్య చేసేందుకు తాము ఎప్పుడూ ప్రయత్నించలేని డీ-కంపెనీలో (దావూద్ గ్యాంగ్) కీలక సభ్యుడిగా ఉన్న ఛోటా షకీల్ చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐపీఎల్‌కు, గ్యాంగ్ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని ఛోటా షకీల్ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే, లలిత్ మోదీతో ఆర్థిక వివాదం ఉందని మాత్రం అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. తమకు రావాల్సిన డబ్బు కోసం మాత్రమే తాము ప్రయత్నించామని అతడు అన్నాడు.
లలిత్ మోదీ, ఆయన కుటుంబసభ్యులను టార్గెట్ చేసేందుకు కుట్ర పన్నినట్టు వచ్చిన వార్తలను కూడా ఛోటా షకీల్ ఖండించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లలిత్ మోదీని గానీ, ఆయన కుటుంబసభ్యులను గానీ కిడ్నాప్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని స్పష్టం చేశాడు. దావూద్ గ్యాంగ్‌పై ఇప్పటికే భారతీయ ఏజెన్సీలు గట్టి నిఘా పెట్టినట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో జాతీయ మీడియాను డీ-కంపెనీ నేరుగా సంప్రదించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి డీ-కంపెనీనే అతి ముఖ్య కారణమని లలిత్ మోదీ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకించే వాడినని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న డీ-కంపెనీతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందని అన్నారు. బెట్టింగులకు సహకరించే అనేక మందిని స్టేడియంలోకి రాకుండా చేశానని చెప్పారు. ఇలాంటి విషయాల్లో చూసిచూడనట్టు ఉండాలని స్వయంగా దావూద్ ఒత్తిడి చేసినా తాను తగ్గలేదని చెప్పారు. ఈ క్రమంలో తన హత్యకు కుట్ర జరిగిందని కూడా ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
మతం మారాలంటూ బలవంతం చేశారు: విప్రో మాజీ ఉద్యోగిని
సరోగసీ కేంద్రాల నియంత్రణ.. కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు