కాలుష్యానికి చెక్ పెట్టే.. చెట్టు కాని చెట్టు!
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:29 AM
నగరాలను కమ్మేస్తున్న ప్రమాదకర వాయు కాలుష్యాన్ని తగ్గించే ‘మొబైల్ లిక్విడ్ ట్రీ’ సాంకేతికతను సీఎ్‌సఐఆర్-సీఐఎంఎ్‌ఫఆర్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్) శాస్త్రవేత్తలు...
సూక్ష్మశైవలాలతో ‘మొబైల్ లిక్విడ్ ట్రీ’ని అభివృద్ధి చేసిన సీఎ్‌సఐఆర్-
సీఐఎంఎ్‌ఫఆర్ శాస్త్రజ్ఞులు
ఇవి మామూలు చెట్లకన్నా 10 రెట్ల వేగం, సామర్థ్యంతో ఆక్సిజన్‌ను ఇస్తాయని వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 7: నగరాలను కమ్మేస్తున్న ప్రమాదకర వాయు కాలుష్యాన్ని తగ్గించే ‘మొబైల్ లిక్విడ్ ట్రీ’ సాంకేతికతను సీఎ్‌సఐఆర్-సీఐఎంఎ్‌ఫఆర్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సాంకేతికంగా దీన్ని ‘స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ (సాల్ట్)’గా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా లిక్విడ్ వృక్షాలు గతంలోనే ఉన్నాయిగానీ.. అవి ఒకచోట స్థిరంగా ఏర్పాటు చేసేవి. కానీ, ఇవి మొబైల్ యూనిట్లు. అంటే.. ఎక్కడ కాలుష్యం ఎక్కువ ఉంటే అక్కడికి తరలించవచ్చు. సాధారణ చెట్లలాగానే ఇవి కూడా గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అయితే, ‘లిక్విడ్ ట్రీ’ అంటే.. పేరుకే చెట్టుగానీ, చెట్టులా కనిపించదు. ఒక పెద్ద గాజు లేదా పారదర్శక ట్యాంకులో నీరు, అందులో సూక్ష్మ శైవలాలు/పాచి ఉంటాయంతే. ఆ సూక్ష్మశైవలాలే సూర్యకాంతి(లేదా కృత్రిమ కాంతి) సాయంతో చుట్టుపక్కల ఉండే గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా ధన్‌బాద్‌లోని సీఐఎంఎ్‌ఫఆర్ ప్రాంగణంలో, మధ్యప్రదేశ్‌లోని బొగ్గు గనుల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విజయవంతంగా పరీక్షించారు. భవిష్యత్తులో.. దేశంలోని పారిశ్రామిక ప్రాంతాలు, మైనింగ్ జోన్లు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరంలో వాడే సూక్ష్మశైవలాలు కిరణజన్య సంయోగ క్రియను సాధారణ చెట్ల కంటే పది రెట్లు వేగంగా చేయగలవు. కొన్ని పెద్ద చెట్లు లేదా ఒక పెద్ద గడ్డి మైదానం ఎంత కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహిస్తాయో అంత మొత్తాన్ని ఒంటరిగా ఒక చిన్న లిక్విడ్ ట్రీ ట్యాంక్ గ్రహించగలదు.
చెట్లకు మించి..
జనాభా ఎక్కువగా ఉండి, పెద్ద పెద్ద చెట్లు పెంచడానికి అవసరమైన ఖాళీ స్థలం ఉండని నగర కూడళ్లు, ఇరుకైన ప్రాంతాల్లో దీనిని సులభంగా ఏర్పాటు చేయవచ్చు. కేవలం గాలిని శుద్ధి చేయడమే కాదు.. ఇది మరిన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సౌరశక్తి, విద్యుత్.. ఇలా రెండింటి ద్వారా రోజంతా పనిచేసేలా ఈ మొబైల్ యూనిట్‌ను డిజైన్ చేశారు. ఇందులో అమర్చిన స్ర్కీన్ ద్వారా ఆ ప్రాంతంలోని వాయు నాణ్యత, ఉష్ణోగ్రత, తేమ, కాలుష్యకారక కణాల వివరాలను ప్రత్యక్షంగా చూడొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్