నిర్భయంగా విధులు నిర్వహించండి.. బాధ్యత నాది: CRPF డైరెక్టర్ జనరల్
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:12 AM
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై పెల్లెట్ తుపాకులు ఉపయోగించడంపై తీవ్ర వివాదం నడుస్తున్న వేళ... కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తమ బలగాలకు మద్దతుగా నిలిచారు.
ఢిల్లీ, జులై 30: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై పెల్లెట్ తుపాకులు (Pellet guns) ఉపయోగించడంపై తీవ్ర వివాదం నడుస్తున్న వేళ... కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ (DG) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (G.P. Singh) తమ బలగాలకు మద్దతుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో ఉన్న దళాలు నిర్భయంగా తమ విధులను నిర్వహించాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధంగా తీసుకునే ప్రతి నిర్ణయానికి, చర్యకు దళాధిపతిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని భరోసా ఇచ్చారు.
సీఆర్‌పీఎఫ్ పతకాల ప్రదానోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ 'సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నాను. అది ఆపరేషనల్ బెటాలియన్ అయినా లేదా లా అండ్ ఆర్డర్ యూనిట్ అయినా... మీ విధి నిర్వహణలో నిష్పాక్షికంగా తీసుకునే నిర్ణయాలు, చర్యలన్నింటికీ డైరెక్టర్ జనరల్‌గా నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. మీరు భయం లేకుండా విధులు నిర్వర్తించండి' అని తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతూ జులై 20న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనలను అదుపు చేసే క్రమంలో సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) పెల్లెట్ తుపాకులను ప్రయోగించడంతో ముగ్గురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్ఏఎఫ్ పనితీరుపై సమీక్ష మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్