ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు: గడ్కరీ
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:40 AM
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడంపై రేగిన విమర్శలు డబ్బిచ్చి చేయించినవి అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు
ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు: గడ్కరీ
న్యూఢిల్లీ, అక్టోబరు 27: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడంపై రేగిన విమర్శలు డబ్బిచ్చి చేయించినవి అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ-100తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు అనుమతిస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు చేసిన ఒక రోజు తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఈ-20కి వ్యతిరేకంగా మూడు నెలల క్రితం పెద్దఎత్తున గళాలు విప్పారు. ఇప్పుడు అవి ఆగిపోయాయి. అదంతా డబ్బిచ్చి చేసిన దుష్ప్రచారం’’ అన్నారు. గత మూడేళ్ల నుంచి కోట్ల కొద్దీ వాహనాలు ఈ-19, ఈ-20 పెట్రోల్ వినియోగిస్తున్నా, ఎలాంటి దుష్ప్రభావాలు కనపడలేదన్నారు.
ఇథనాల్ శాతాన్ని 20 కంటే పెంచం: హర్దీప్
న్యూఢిల్లీ, అక్టోబరు 27: పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను 20 శాతం కంటే పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. దక్షిణ గోవాలో 29వ ఎనర్జీ టెక్నాలజీ, ఇన్నోవేషన్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బయో ఇంధనాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ-20పై జరిగిన దుష్ప్రచారం ఓ కల్పిత కథ అని పేర్కొన్నారు. ఒకవేళ ఇంజన్లలో సమస్యలు వస్తే రోజుకు 6 కోట్ల వాహనాలు షెడ్లకు వెళ్లేవని అన్నారు. 2003కు ముందు తయారైన వాహనాల విషయంలోనే ఈ-20 పెట్రోల్ సమస్య వచ్చిందన్నారు. ఈ-20 పెట్రోల్ ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రూ.1.60 లక్షల కోట్లు మిగిలిందని, దానిలో 1.40 లక్షల కోట్లు రైతులకు ఇచ్చేశామని వెల్లడించారు. రైతులు అన్నదాతల నుంచి ఇంధన దాతలుగా మారారని అన్నారు