ఇండియా కూటమి ఇక లేనట్టే.. డీఎంకే సీనియర్ నేత ఆగ్రహం
ABN , Publish Date - May 07 , 2026 | 09:18 PM
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు పలకడంపై డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్ మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యతో ఇండియా కూటమని కథ ముగిసినట్టేనని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం ఇండియా కూటమిలో పెను కలకలం రేపుతోంది. ఈ విషయంలో డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి కథ ముగిసిందని అన్నారు. ఎంతో కాలంగా అండగా నిలిచిన డీఎంకేను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నిష్క్రమణ తరువాత వీసీకే, లెఫ్ట్ పార్టీలు డీఎంకే వెంట ఉంటాయా? అన్న ప్రశ్నకు కూడా ఇళంగోవన్ బదులిచ్చారు. తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని అన్నారు.
‘సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలు తమ నాయకత్వంతో ఈ విషయమై చర్చిస్తామని అన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తాము. ఇలాగే చేయాలని బలవంతం పెట్టము’ అని ఇళంగోవన్ అన్నారు.
మార్పు కోరుకుంటున్న ప్రజల తీర్పునకు అనుగుణంగా టీవీకేకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ పేర్కొంది. సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటవ్వాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. మతవాద శక్తులు అధికారంలోకి రాకుండా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. టీవీకే సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్‌కు 1967 తరువాత తమిళనాడులో తొలిసారిగా అధికారంలో భాగస్వామ్యం దక్కినట్టు అవుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ రద్దు
నేను మమతను ఎన్నికల్లో ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు: సువేందు అధికారి