నేను మమతను ఎన్నికల్లో ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు: సువేందు అధికారి
ABN , Publish Date - May 07 , 2026 | 07:23 PM
తాను మమతా బెనర్జీని ఎన్నికల్లో ఓడించినందుకే తన పీఏ హత్య జరిగిందని బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్య నేపథ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించినందుకే పీఏ హత్య జరిగిందని మండిపడ్డారు. రథ్ పోస్టుమార్టం అనంతరం బరాసత్ జనరల్ ఆసుపత్రి బయట సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రనాథ్ రథ్ ఎయిర్‌ఫోర్స్‌లో చేశారని అన్నారు.
ఆయన తన పీఏగా ఉండకపోయి ఉంటే, లేదా తాను మమతా బెనర్జీని ఓడించకపోయి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రథ్‌కు ఎవరితోనూ ఎలాంటి రాజకీయ వ్యక్తిగత వైరం లేదని కూడా చెప్పారు. రథ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టు పోస్టుమార్టంలో తేలిందని అన్నారు. తాను బాధిత కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడాలని బాధిత కుటుంబం కోరుతోందని చెప్పారు.
కాగా, ఈ కేసుపై దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఈ సిట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని కూడా పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితులు పట్టుబడాల్సి ఉందని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి
తమిళనాడులో అద్భుతం జరగబోతోంది.. AIADMK సీనియర్ నేత అన్బళగన్ కీలక వ్యాఖ్యలు
మాజీ ఖైదీని పెళ్లాడిన లేడీ డిప్యూటీ జైలర్