Share News

విరాళాల వివాదంలో కీలక పరిణామం.. చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు..

ABN , Publish Date - Jul 02 , 2026 | 02:41 PM

చంపత్ రాయ్​‌పై ‘ది బార్ అసోసియేషన్ ఆఫ్ ఫైజాబాద్’ లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య జిల్లాలోని రామజన్మ భూమి పోలీస్ స్టేషన్‌లో చంపత్ రాయ్‌తో పాటు అనిల్ మిశ్రా, కృష్ణ దేవ్, గోపాల్ రావ్‌లపై కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విరాళాల వివాదంలో కీలక పరిణామం.. చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు..
Ayodhya Ram Mandir Trust

ఇంటర్‌నెట్ డెస్క్: అయోధ్య నిధుల దుర్వినియోగం వ్యవహారంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ జనరల్‌ సెక్రటరీ చంపత్ రాయ్​ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జూన్ 27వ తేదీన ఆయన తన రాజీనామాను సమర్పించారు. చంపత్ రాయ్‌తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా సమర్పించారు. విరాళాల దుర్వినియోగం వివాదంలో నైతిక బాధ్యత వహిస్తూ ఈ ఇద్దరు నేతలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చంపత్ రాయ్​‌పై ‘ది బార్ అసోసియేషన్ ఆఫ్ ఫైజాబాద్’ లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయోధ్య జిల్లాలోని రామజన్మ భూమి పోలీస్ స్టేషన్‌లో చంపత్ రాయ్‌తో పాటు అనిల్ మిశ్రా, కృష్ణ దేవ్, గోపాల్ రావ్‌లపై కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా శరణ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాము. ఐదుగురు వ్యక్తులు ఫిర్యాదు హార్డ్ కాపీ తీసుకోవడానికి స్టేషన్‌లోకి వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు కాపీ ఇవ్వకపోతే ఆందోళన కొనసాగిస్తాము. రామ్ మందిర్ విషయంలో నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు’ అని తెలిపారు.


కాగా, విరాళాల లెక్కింపులో అవినీతి జరిగిందంటూ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జూన్ 7వ తేదీన సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. జూన్ 25వ తేదీన పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న 8 మంది ఉద్యోగులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా చంపత్ రాయ్ స్టేట్‌మెంట్‌ను దర్యాప్తు అధికారులు రికార్డ్ చేశారు. ఇక, జులై 6వ తేదీన అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 2/3 వంతు మెజారిటీతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల భవితవ్యంపై ట్రస్ట్ నిర్ణయం తీసుకోనుంది. సిట్ సిఫార్సుల మేరకు ట్రస్ట్ మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.


ఇవి కూడా చదవండి

మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్

Updated Date - Jul 02 , 2026 | 03:19 PM