వాణిజ్యమంట గ్యాస్
ABN , Publish Date - May 02 , 2026 | 06:35 AM
వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా రూ.993 పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటిల్లో...
వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.993 పెంపు.. బెజవాడలో 3,251కి చేరిన ధర
5 కిలోల సిలిండర్ మీద రూ.549 పెంపు
ఒకేసారి ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి
లీటరు బల్క్ డీజిల్ ధర రూ.137 నుంచి రూ.149కి
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే నిర్ణయం
ప్రభుత్వ చమురు సంస్థ ఐఓసీ ప్రకటన
గృహవినియోగ సిలిండర్‌పై రూ.40-50, పెట్రోల్,
డీజిల్‌పై రూ.4-5 పెరిగే చాన్స్: ప్రభుత్వ వర్గాలు
న్యూఢిల్లీ, మే 1: వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా రూ.993 పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటిల్లో వినియోగించే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071కి చేరుకుంది. విజయవాడలో రూ.2250 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.3251కి చేరింది. ఆయా రాష్ట్రాల్లో ఉండే పన్నుల మేరకు ఇది వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు, 5 కిలోల సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.549 మేర పెంచాయి. దీంతో ఆ సిలిండర్ ధర రూ.993కి చేరింది. వాణిజ్య సిలిండర్, 5 కిలోల సిలిండర్ ధరను ఒకేసారి ఇంత భారీగా పెంచటం ఇదే తొలిసారి. కాగా, ఎల్‌పీజీ గృహ వినియోగదారుల మీద మాత్రం చమురు సంస్థలు భారం మోపలేదు. దీంతో ఇళ్లలో వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు లేదు. అదే విధంగా రిటైల్ పెట్రోల్, డీజిల్, దేశీయ విమాన సర్వీసులు వినియోగించే ఇంధన ధరలను కూడా పెంచలేదు. టెలికాం సిగ్నల్ టవర్ల వంటి వాటిల్లో ఉపయోగించటానికి వాడే బల్క్ డీజిల్ ధరను ఇప్పుడున్న రూ.137 నుంచి రూ.149కి (లీటరుకి) పెంచారు. ఈ మేరకు ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐఓసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో వినియోగించే ఇంధనాల్లో దాదాపు 80 శాతం వాటా ఉన్న రిటైల్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్, కిరోసిన్ ధరలను పెంచలేదని.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల ప్రభావం ఈ వినియోగదారుల మీద పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాణిజ్య సమర్థించుకుంటూ.. దేశంలోని మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో వాణిజ్య సిలిండర్ల వాటా 1% లోపే ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, దేశీయ వినియోగదారులను కాపాడుకుంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం తర్వాత ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు 50ు పెరిగాయి. కాగా, వాణిజ్య సిలిండర్ మీద ఈ ఏడాది మార్చి 1న రూ.28, మార్చి 7న రూ.114, ఏప్రిల్‌లో రూ.196 మేర చమురు కంపెనీలు పెంచాయి.
త్వరలో పెట్రోల్, డీజిల్‌పై రూ.4-5 భారం!
రిటైల్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరల పెంపు అవకాశాలు లేకపోలేదని శుక్రవారం కేంద్రప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్, డీజిల్ మీద లీటరుకు రూ.4-5, సిలిండర్‌పై రూ.40-50 వరకు పెంచే అవకాశాలున్నాయని, దీనిపై వచ్చే వారం రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగనున్నాయన్న ఊహాగానాలను కేంద్రప్రభుత్వం పలుమార్లు ఖండిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగానే.. చమురు ధరలు పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించటం గమనార్హం. మరోవైపు, వాణిజ్య సిలిండర్ ధరను భారీగా పెంచటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 6వ తేదీన కేరళలో హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ జరపనున్నట్లుగా ఆ రాష్ట్ర హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం ప్రకటించింది. కేరళలో గత ఐదు నెలల్లో వాణిజ్య సిలిండర్ ధర రూ.1498 మేర పెరిగిందని, ఇది అన్యాయమని, దీనిపై దశల వారీగా పోరాటం నిర్వహిస్తామని తెలిపింది. కేరళకు చెందిన కేంద్ర మంత్రి సురే్‌షగోపి.. వాణిజ్య సిలిండర్ ధర పెంపును సమర్థించారు. అంతర్జాతీయంగా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు.
ప్రధాని మాట నిలుపుకోరు: ఖర్గే
ప్రధాని మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోరని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. కలబురగిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ ధరలను పెంచబోమని ప్రధాని ఇటీవల ప్రకటించారని, కానీ శుక్రవారం 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.993 పెంచారని, అన్నివర్గాల ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. వరుసగా మూడో నెల గ్యాస్ ధరలను పెంచారని, మోదీ ఇంత భారం మోపుతున్నా ప్రజలు ఇంకా ఆయనకు మద్దతు ఇస్తున్నారని, ప్రజల అభిప్రాయం ఏమిటో తనకు అర్థం కావడం లేదని వాపోయారు.
గ్యాస్ బండకు నిబంధనలు కఠినతరం
దక్షిణాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఏర్పడ్డ ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీకి కొన్ని నిబంధనలను మే 1 నుంచి అమలులోకి తెచ్చింది. గ్యాస్ సరఫరాలో పారదర్శకత పెంపు, దుర్వినియోగ నివారణ, సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడమే లక్ష్యంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో పట్టణప్రాంత వినియోగదారులకు తదుపరి బుకింగ్‌కు వ్యవధి 21 రోజులు ఉండగా దానిని 25 రోజులకు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 45 రోజులుగా ఉంది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుని రిజిస్టర్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. బండ డెలివరీ అయిన రోజు ఆ ఓటీపీ(డీఏసీ) ఏజెంట్‌కు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత కేవైసీ తప్పనిసరి. ఎల్‌పీజీ, పైప్డ్ నాచురల్ గ్యాస్(పీఎన్‌జీ)... రెండూ వాడుతున్న వినియోగదారులకు ఇక నుంచి ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాళ్లు తక్షణమే ఎల్‌పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాలి.
ఇప్పటికి గ్యాస్ మంటలు..
తర్వాత పెట్రో బాదుడు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శ
ప్రస్తుతానికి గ్యాస్ మంటలని, దీని తర్వాత పెట్రో బాదుడు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికలు ముగియగానే సామాన్యుడిపై ప్రభుత్వం ధరల భారం మోపనుందని తాను ఇటీవలే హెచ్చరించిన సంగతిని శుక్రవారం ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా గుర్తు చేశారు. ‘ఈ రోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెరిగింది. ఒకే రోజులో ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ఎన్నికల తాలూకు అసలు బిల్లు ఇదే. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే.. ధర ఏకంగా రూ.1,380 పెరిగింది. కేవలం మూడు నెలల్లో 81 శాతం భారీ పెరుగుదల ఇది. టీ కొట్టు, దాబా, హోటల్, బేకరీ, స్వీట్ షాపు.. ఇలా ప్రతి ఒక్కరి కిచెన్ మీద భారం పెరిగింది. దీని ప్రభావం అందరి మీదా ఉంటుంది. మొదటి దెబ్బ గ్యాస్‌పై పడింది. తదుపరి దెబ్బ పెట్రోల్-డీజిల్‌పై పడబోతోంది’ అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం ఆ లాభాల్ని మూటగట్టుకుందని, ఇప్పుడు ద్రవ్యోల్బణం, చమురు ధరలు పెరగ్గానే ఆ భారాన్ని జనం మీద రుద్దుతోందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ