సజేఐ వ్యాఖ్యలతో పుట్టి..
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:45 AM
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం వెనుక.. ఆ పార్టీ పుట్టుక వెనుక.,.
వ్యంగ్యంగా మొదలై.. పెను విప్లవమై!
కాక్రోచ్ పార్టీ పుట్టుకే సంచలనం
నీట్ ఉద్యమంతో యువత ఏకం
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం వెనుక.. ఆ పార్టీ పుట్టుక వెనుక.,. ఒకే ఒక్క వ్యాఖ్య ఉందంటే ఆశ్చర్యం వేయకమానదు. సరిగ్గా ఈ ఏడాది మే 15. సుప్రీంకోర్టులో ‘నకిలీ డిగ్రీల కేసు’ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉపాధి దొరకని నిరుద్యోగులు, వృత్తిలో నైపుణ్యం లేని యువత బొద్దింకల్లా విస్తరిస్తున్నారు. ఇలాంటి వారు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని సోషల్ మీడియా కార్యకర్తలుగా మారి పరాన్నజీవుల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలో.. అంటే, మే 16న అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?.’’ అని ఆయన చేసిన ఓ చిన్న కామెంట్ పెను సంచలనంగా మారింది. ఈ పోస్టు భారీ ఎత్తున వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాను కుదిపేసింది. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్.. మరో వ్యక్తిసాయంతో కృత్రిమ మేధ(ఏఐ)ను వినియోగించి ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ) పేరుతో వ్యంగ్య(సెటైరికల్) వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ సైట్ వేదికగా లక్షలాది మంది యువత ఏకమయ్యారు. అనంతరం.. ఎక్స్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లోనూ సీజేపీకి భారీ స్పందన లభించింది. విద్యార్థుల నుంచి తటస్థుల వరకు లక్షలాది మంది ఫాలోయర్లుగా మారారు. ఇన్‌స్టాలో అయితే.. 2.5కోట్ల మంది అనుచరులు చేరారు. దేశ, విదేశాల్లోనూ సీజేపీకి మద్దతు లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తాను చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలపై తదనంతర కాలంలో వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా పేర్కొందన్నారు. ‘‘నిరుద్యోగ యువత మొత్తాన్నీ నేను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తి చేపట్టిన వారిని, సోషల్ మీడియాలోకి వచ్చిన వారి గురించే తప్పుబట్టా. నా భావాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయారు’’ అని వివరణ ఇచ్చారు.
ఐదు అంశాలతో మేనిఫెస్టో
‘బద్ధకస్తులు, నిరుద్యోగుల గొంతుక’ అనే నినాదంతో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ.. ఆవిర్భావంలోనే ఐదు అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. 1) పదవీ విరమణ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ సీటు ఇవ్వరాదు. 2)చట్టబద్ధమైన ఎవరి ఓటు హక్కును తొలగించినా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేయాలి. 3) పార్లమెంటు సీట్లు పెంచకుండానే మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలి. క్యాబినెట్ పదవుల్లోనూ వారికి 50 శాతం కేటాయించాలి. 4) ‘గోది మీడియా’ సంస్థల లైసెన్సులు రద్దు చేయాలి. 5) పార్టీలు ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేలపై 20ఏళ్లపాటు అనర్హత వేటు వేయాలి. అనే అంశాలు చర్చనీయాంశ మయ్యాయి.
నీట్ ఉద్యమంతో..
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు నివ్వెర పోయారు. పలువురు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే(మే నెలలో) సీజేపీ విద్యార్థుల పక్షాన తన గళం వినిపించింది. సంప్రదాయ రాజకీయాలు, రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏర్పడి విద్యార్థుల కోసం.. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో అభిజిత్ దీప్కేపై దాడి కూడా జరిగింది. అయినప్పటికీ.. దీప్కే వెనుదిరగకుండా ముందుకు సాగి యువతను ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు.
(సెంట్రల్ డెస్క్)
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు