Share News

కాక్రోచ్‌ల తర్వాతి టార్గెట్‌ ఉద్యోగాలే!

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:53 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జెన్‌ జీ యువత చేపట్టిన పోరాటంలో విజయం సాధించింది. సీజేపీ ఉద్యమం...

కాక్రోచ్‌ల తర్వాతి టార్గెట్‌ ఉద్యోగాలే!

  • జంతర్‌మంతర్‌ ఆందోళనల్లో పెద్ద

సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగులు, పోటీ పరీక్షల ఆశావహులు

  • ఇప్పుడు వారి డిమాండ్లే ఎజెండాగా మారే అవకాశం

న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జెన్‌ జీ యువత చేపట్టిన పోరాటంలో విజయం సాధించింది. సీజేపీ ఉద్యమం ప్రధానంగా నీట్‌ లీకేజీ, పరీక్షల పారదర్శకత, విద్యార్థులకు న్యాయం వంటి అంశాల చుట్టే తిరిగింది. మరి ఇప్పుడు సీజేపీ కొత్తగా ఏ ఎజెండా ఎత్తుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఇకపై ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలే కొత్త ఎజెండాగా పోరాటం మొదలుకావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నీట్‌ లీకేజీ ఆందోళనలకు ముందే.. నిరుద్యోగులను ఉద్దేశించి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ చేసిన ‘కాక్రోచ్‌లు’ వ్యాఖ్యలతోనే సీజేపీ పుట్టిందని.. ఉద్యోగాలు, ఉపాధి కల్పన డిమాండ్‌ వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తాము ప్రస్తుతానికి ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నామని.. అనేక ఇతర అంశాలపై తమ భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ తాజాగా వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడటంపై దృష్టిపెడతామని ఆయన తెలిపారు.

ఆందోళనల్లో నిరుద్యోగులు, పట్టభద్రులు

సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో కేవలం నీట్‌ అభ్యర్థులు, విద్యార్థులే కాదు.. యూపీఎస్సీ, ఎస్‌ఎ్‌ససీ, రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది జెన్‌ జీ యువత, ఇంజనీరింగ్‌ పట్టభద్రులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, నియామక పరీక్షల లీకులు, అక్రమాలకు చెక్‌పెట్టడం, భర్తీ ప్రక్రియల్లో పారదర్శకత అంశాలపైనా వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాక్రోచ్‌ పార్టీ, జెన్‌ జీ ఉద్యమం విద్యా పరీక్షల సమస్యను దాటి.. యువత భవిష్యత్తు, ఉద్యోగాల అవకాశాలపై దృష్టిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పార్టీగాగానీ, సంఘంగానీ సీజేపీకి వ్యవస్థీకృత నిర్మాణం లేదని, కేవలం సోషల్‌ మీడియా ద్వారానే కార్యకలాపాలు కొనసాగాయని తెలిపారు. మరి ఇకపై పోరాటాలకు ఈ స్థాయిలో యువతను సీజేపీ సమీకరించగలదా అన్న సందేహాలూ ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 06:08 AM