Share News

లీకేజీ నుంచి.. రాజీనామా వరకూ!

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:35 AM

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవిని ఊడగొట్టింది. ఢిల్లీలో తీవ్రమైన యువత, విద్యార్థుల ఉద్యమంతో ఆయన తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు...

లీకేజీ నుంచి.. రాజీనామా వరకూ!

గత మూడు నెలల నుంచి ఏం జరిగిందంటే...

న్యూఢిల్లీ, జూలై 25: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవిని ఊడగొట్టింది. ఢిల్లీలో తీవ్రమైన యువత, విద్యార్థుల ఉద్యమంతో ఆయన తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇటు ప్రజాగ్రహంతో పాటు అటు రాజకీయంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రధాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ తర్వాత దేశవ్యాప్తంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అవిశ్రాంతంగా దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టడం, ప్రముఖ పర్యావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల నిరాహార దీక్ష, నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే మొదటి వారంలో నీట్‌ పరీక్ష జరిగిన నాటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా వరకూ జరిగిన పరిణామాలను ఒక్కసారి చూద్దాం..

మొదటి దశ: పరీక్ష నిర్వహణ, లీకేజీ వ్యవహారం

మే 3, 2026: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు 5,432 పరీక్షా కేంద్రాల్లో నీట్‌ యూజీ-2026 పరీక్షను నిర్వహించింది.

మే 6-8: ఎన్‌క్రిప్టెడ్‌ చాట్‌ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రశ్నపత్రం విస్తృతంగా లీక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక ‘గెస్‌ పేపర్‌’ అయితే అసలు ప్రశ్నపత్రాన్ని పోలివుండడం దేశవ్యాప్తంగా ఆందోళనలు రేపింది.

మే 12: అక్రమాల నేపథ్యంలో నీట్‌ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

మే 15: పరీక్షలో అక్రమాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి అధికారికంగా మీడియా ముందు అంగీకరించారు. మరోవైపు వ్యవస్థల గురించి సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు చేసే కొందరు నిరుద్యోగ భారత యువకులు ‘బొద్దింకలు’ వంటి వారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

మే 16: సీజేఐ వ్యాఖ్యలకు స్పందనగా.. బోస్టన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన 30 ఏళ్ల అభిజీత్‌ దీప్కే, రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ని ప్రారంభించారు.

మే 21: సీజేపీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది.

జూన్‌ 2, 2026: పేపర్‌ లీకేజీలపై ముంబైతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జూన్‌లోనూ ఆందోళనలు కొనసాగాయి.

జూన్‌ 6: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ చేపట్టిన మొదటి ఆందోళనలో పాల్గొనేందుకు అభిజీత్‌ దీప్కే అమెరికా నుంచి భారత్‌ తిరిగొచ్చారు. ఆందోళన చేపట్టారు

జూన్‌ 11: పరీక్ష రద్దు కారణంగా నష్టపోయిన వారికి పరిహారం, పరీక్షల వ్యవస్థలో మార్పులు సహా ఐదు పాయింట్లతో కూడిన ‘మేనిఫెస్టో’ను సీజేపీ విడుదల చేసింది.


రెండో దశ: ఆందోళనలు తీవ్రం, వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష

జూన్‌ 20, 2026: డిమాండ్లపై ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోవడంతో.. సీజేపీ మద్దతుదారులు జంతర్‌మంతర్‌లో దీక్ష ప్రారంభించారు.

జూన్‌ 21: ఎన్టీఏ దేశవ్యాప్తంగా నీట్‌ రీటెస్టును నిర్వహించింది.

జూన్‌ 25-28: సీజేపీ ఉద్యమానికి జెన్‌జీ విద్యార్థుల నుంచి భారీ మద్దతు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సీజేపీ జంతర్‌మంతర్‌ వద్ద ఒక పర్మినెంట్‌ ఆందోళన క్యాంపును ఏర్పాటు చేసుకుంది.

జూన్‌ 28: సీజేపీ, దేశ యువతకు మద్దతుగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.

జూలై 9, 2026: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జూలై 20న పార్లమెంట్‌కు శాంతియుత మార్చ్‌ చేపట్టాలని వాంగ్‌చుక్‌ పిలుపు.

జూలై 16: నీట్‌ యూజీ రీటెస్టు ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇదే సమయంలో నిరాహార దీక్షకు కూర్చొన్న వాంగ్‌చుక్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు 24 గంటలూ వైద్య సహాయంపై ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది.

జూలై 18: ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌ను బలవంతంగా జంతర్‌మంతర్‌ నుంచి సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు.


మూడో దశ: పార్లమెంట్‌కు మార్చ్‌, ప్రభుత్వ స్పందన

జూలై 20: సీజేపీ నాయకత్వంలో జరిగిన ‘చలో పార్లమెంట్‌’ ఆందోళనలో వేలాది మంది యువత పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలయ్యాయి. ముంబై, బెంగళూరు నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి.

జూలై 23: సీజేపీ ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళనల పిలుపుతో దాదాపు 30 నగరాల్లో ఆందోళనలు జరిగాయి. ఇదే రోజున ప్రధాని మోదీ ఒక బహిరంగ ప్రసంగం వీడియోను విడుదల చేశారు. పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు, నేరస్తులను విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఒక కొత్త క్యాబినెట్‌ బిల్లు తీసుకొస్తామన్నారు.

జూలై 24: తమ డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ నేపథ్యంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ సమక్షంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ తన 26 రోజుల నిరాహార దీక్షను ఆస్పత్రిలో విరమించారు.

నాలుగో దశ: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

జూలై 25 (ఉదయం): వాంగ్‌చుక్‌ దీక్షను విరమించినప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనే తమ ప్రధానమైన డిమాండ్‌ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని సీజేపీ స్పష్టం చేసింది.

జూలై 25 (మధ్యాహ్నం 2.30 గంటలకు): అటు రాజకీయంగా, ఇటు యువత నుంచి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చివరకు రాజీనామా చేశారు. దేశ యువత భవిష్యత్తును పరిరక్షించేందుకు, కొనసాగుతున్న ఆందోళనలను దుష్టశక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా ఉండేందుకు తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపానంటూ ‘ఎక్స్‌’లో ఒక సుదీర్ఘమైన పోస్టు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:35 AM