Share News

సీజేపీ త్రిమూర్తులు!

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:50 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ దీప్కే.. అందరి మాదిరి ఆవేశ పోస్టులకు పరిమితం కాలేదు. ఆవేదనతో వ్యవస్థపై నిట్టూర్చనూలేదు. ఒక చిన్న విమర్శను పట్టుకుని...

సీజేపీ త్రిమూర్తులు!

ఒకరు డిజిటల్‌ మాధ్యమాలతో.. మరొకరు తెరవెనుక వాస్తవ సమాచారంతో

ఇంకొకరు క్షేత్రస్థాయిలో మార్గదర్శకం

న్యూఢిల్లీ, జూలై 25: కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ దీప్కే.. అందరి మాదిరి ఆవేశ పోస్టులకు పరిమితం కాలేదు. ఆవేదనతో వ్యవస్థపై నిట్టూర్చనూలేదు. ఒక చిన్న విమర్శను పట్టుకుని.. ఒక ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థనే కదిలించారు. దీప్కేకు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రంకా రెండు కళ్లలాగా వ్యవహరించారు. వీరి విద్యా నేపథ్యం.. ఉద్యమ పథాన్నిక్లుప్తంగా తెలుసుకుందాం.

అభిజిత్‌ దీప్కే

30ఏళ్ల అభిజిత్‌ దీప్కేకు యువతను ఉద్యమం వైపు ఎలా తిప్పుకోవాలో బాగా తెలుసు.2020 నుంచి 2023వరకు ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)కి సోషల్‌ మీడియా వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన సమర్థతను గర్తించి, ఆప్‌ సర్కారు కమ్యూనికేషన్‌ సలహాదారు పదవిని దీప్కేకు కట్టబెట్టింది. 2023లో ఆప్‌ నుంచి బయటకొచ్చేశారు. 1995 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌)లో దళిత కుటుంబంలో జన్మించారు. దీప్కే తండ్రి భగవాన్‌రావు ఎంఐడీసీ రిటైర్డ్‌ ఇంజనీర్‌. తల్లి గృహిణి. దీప్కే తొలుత ఇంజనీరింగ్‌లో చేరినప్పటికీ.. తనకిష్టమైన జర్నలిజంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీకి వెళ్లి (2003 తర్వాత) పబ్లిక్‌ రిలేషన్స్‌లో ఎంఎస్‌ పట్టా పొందారు. నిరుద్యోగులు, సోషల్‌ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేవారిని ‘కాక్రోచ్‌లు’ (బొద్దింకలు)గా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్య ఆధారంగా.. మే 16న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుతో ఒక వేదికను బోస్టన్‌ నుంచే ప్రకటించడం, 48 గంటల్లోనే 40,000 మంది అనుసరించడం వేగంగా, అనుకోకుండా జరిగిపోయాయి. బోస్టన్‌ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చి, ఉద్యమానికి ప్రణాళిక రచించారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను సంస్కరించాలంటూ జంతర్‌ మంతర్‌ వేదికపై జూన్‌ 20న ఉద్యమం ప్రారంభించారు.

సౌరవ్‌దాస్‌

ఢిల్లీకి చెందిన సౌరవ్‌దాస్‌ (27) జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివి.. పరిశోధనాత్మక జర్నలి్‌స్టగా పనిచేసేవారు. 18 ఏళ్లకే ఆర్‌టీఐ హక్కును వినియోగించుకున్న చురుకైన యువకుడు. రాజకీయ నేతల మాదిరి అడ్డగోలు ప్రసంగాలు సౌరవ్‌ గళంలో వినిపించవు. ఏది మాట్లాడినా, వాస్తవ సమాచారం ఆధారంతో పక్కాగా ఉంటారు. ఎత్తుకున్న అంశం ఏదైనా, లోతుల్లోకి వెళ్లి, తగిన పత్రాలతో పారదర్శకంగా వ్యవహరిస్తారని పేరు. సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా ప్రతీ అంశంపై స్పష్టమైన గళాన్ని వినిపించారు. నీట్‌ విషయంలో ప్రభుత్వ డేటాను తవ్వి తీశారు. ఉద్యమాన్ని పటిష్టంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో చర్చల విషయంలో విస్పష్టంగా, పట్టువిడువకుండా పనిచేశారు.


అశుతోష్‌ రంకా

చలో పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నడిపించిన ముఖ్యుల్లో అశుతోష్‌(28) ఒకరు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. సీజేపీ ఉద్యమ లక్ష్యాల దిశగా అనుచరులను నడిపించడంలో సమర్థవంతమైన పాత్ర పోషించారు. ఐఐటీ కాన్పూర్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన రంకా.. సీజేపీ బలగంలో కీలకం.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:50 AM