Share News

జంతర్‌మంతర్‌’ బారికేడ్లు దాటిన సీజేపీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:43 AM

న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలకు అవకాశం లేకుండా ఢిల్లీ పోలీసులు సోమవారం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

జంతర్‌మంతర్‌’ బారికేడ్లు దాటిన సీజేపీ
jantharmanthar

  • సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా, షిండే సహా పలువురి అరెస్టు

  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా

చేసే దాకా ఉద్యమిస్తాం: సీజేపీ

  • నేడు ఢిల్లీలో ఆందోళన ఖాయం: దీప్కే

న్యూఢిల్లీ, అక్టోబరు 13 : న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలకు అవకాశం లేకుండా ఢిల్లీ పోలీసులు సోమవారం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, ఆ బారికేడ్లను దాటేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) మంగళవారం యత్నించింది. ఈ క్రమంలో తమ ముఖ్యనేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా, అజింక్య షిండే తదితరులను పోలీసులు అరెస్టు చేశారని సీజేపీ ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి జంతర్‌మంతర్‌లో బ్యారికేడ్లు దాటారనే ఆరోపణలపై సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ సహా 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపే తమ హక్కును ఉపయోగించుకునేందుకు తాము జంతర్‌మంతర్‌లోకి వెళ్లామని సీజేపీ ఈ సందర్భంగా పేర్కొంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేసింది. ఎవరూ ఏం చేసినా సరే.. జ్ఞానేశ్‌ కుమార్‌ జంతర్‌ మంతర్‌ వద్ద రాజీనామా చేయడం ఖాయమని అశుతోష్‌ రంకా పేర్కొన్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు చేయకుండా నిషేధం విధించేందుకు హోం శాఖ ఎవరని సౌరవ్‌ దాస్‌ ప్రశ్నించారు. ఇక, జాతీయ జెండాలు పట్టుకొని జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించిన కాక్రోచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.


‘ తిరుగుబాటును ఆపడం మీవల్ల కాదు’ అంటూ ప్రధాని మోదీని ఆ పోస్టుకు ట్యాగ్‌ చేశారు. తన నాయనమ్మ అంత్యక్రియల కోసం మహారాష్ట్రలోని తన స్వగ్రామం పింప్రికి వెళ్లిన అభిజీత్‌ దీప్కే.. మంగళవారం అక్కడి విలేకరులతో మాట్లాడారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం ఆందోళన చేయడం ఖాయమన్నారు. నిరసనకు వెళ్లనీయకుండా పోలీసులు తనని అడ్డుకుంటే.. అక్కడి నుంచే నిరసన మొదలుపెడతానని దీప్కే స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలను నిషేధిస్తే ఆందోళనలు ఆగిపోతాయని ప్రభుత్వం అనుకుంటోందని, కానీ, దేశమంతా జంతర్‌మంతర్‌ అవుతుందని దీప్కే హెచ్చరించారు

కాంగ్రెస్‌ ఆకస్మిక ఆందోళన, అరెస్టులు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ యువత విభాగం ఎన్‌ఎస్‌యూఐ(నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా) ఢిల్లీలో మంగళవారం ఆకస్మిక ఆందోళన చేపట్టింది. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వినోద్‌ జాఖార్‌ నేతృత్వంలో వందలాది మంది జంతర్‌మంతర్‌ సమీపంలోని రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. అధికార యంత్రాంగం పోలీసులను ఉపయోగించి శాంతియుత నిరసనలను అడ్డుకుంటోందని ఎన్‌ఎస్‌యూఐ ఈ సందర్భంగా ఆరోపించింది. ఎన్ని అరెస్టు చేసినా ఎన్నికల సంఘంలో జవాబుదారీతనం కోసం తాము చేస్తున్న ఉద్యమం ఆగదని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

Updated Date - Oct 14 , 2026 | 04:44 AM