సుప్రీం కోర్టు తలుపులు తెరిచే ఉంటాయ్: చీఫ్ జస్టిస్
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:57 AM
సుప్రీం కోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలతో సమావేశం కాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలతో సమావేశం కాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. అయితే, ఈ విషయంలో ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్ వేయవచ్చని చెప్పారు. సర్ ప్రక్రియపై చర్చించేందుకు అనుమతిని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఓటు చోరీకి ఫుల్ స్టాప్ పడటం, సీఈసీ రాజీనామా, సర్ ప్రక్రియకు ముగింపు పలకాలన్న అభ్యర్థనలతో వినతిపత్రం ఇచ్చేందుకు సమయం కోరారు.
‘వారి నుంచి నాకు లేఖ వచ్చింది. ఆ రాత్రే నేను ప్రత్యుత్తరం ఇచ్చాను. మీటింగ్ ఎందుకు కుదరదో కారణాలను కూడా వివరించాను. సుప్రీం కోర్టు తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయి. ప్రభుత్వ సంస్థల నుంచి సామాన్య పౌరుల వరకూ ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రతి పౌరుడికీ ఈ హక్కు ఉంటుంది. వారి అభ్యంతరాలను విని చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము’ అని అన్నారు. జాతీయ మానవహక్కుల సంస్థ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలపై న్యాయప్రక్రియల ద్వారా దృష్టిసారించడం మెరుగ్గా ఉంటుందని చీఫ్ జస్టిస్ తన లేఖలో అభిప్రాయపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరోవైపు, కాంగ్రెస్ నేడు ఛలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమాన్ని తలపెట్టింది. పార్టీలు, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతోందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తిరువళ్లువర్‌కు కాషాయ రంగు.. బీజేపీపై టీవీకే సెటైర్లు..
హిట్ అండ్ రన్ కేసులో రూ.2 లక్షల పరిహారం.. పొందే మార్గమిదే!