Share News

తిహాడ్‌జైలుకు సౌరవ్‌, అశుతోష్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:56 AM

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకాలకు కోర్టు బుధవారం 5 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

తిహాడ్‌జైలుకు సౌరవ్‌, అశుతోష్‌
sourav ,ashuthosh

  • జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించినందుకు సీజేపీ నేతలకు 5 రోజుల కస్టడీ

  • ఆర్నెల్లు ఉద్యమాల్లో పాల్గొనను.. షిండే బాండు

  • జంతర్‌మంతర్‌ ప్రైవేటు ప్రాపర్టీ.. అనుమతి

లేకుండా ప్రవేశించినందుకే అరెస్టు: పోలీసులు

  • అక్కడ జాతీయ జెండా ఎగురవేయటం నేరమా?

  • మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపణలు

  • జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకాలకు కోర్టు బుధవారం 5 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మరో నేత అజింక్య షిండే నుంచి వచ్చే ఆరు నెలల పాటు శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు చేపట్టబోనని వ్యక్తిగత బాండుతోపాటు రూ.5000 పూచీకత్తు తీసుకొని విడుదల చేసింది. సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకా, అజింక్య షిండేతోపాటు మొత్తం 14 మంది మంగళవారం జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకొని జాతీయ పతాకాలను ఎగురవేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టకుండా జంతర్‌మంతర్‌ను అప్పటికే ప్రభుత్వం డీనోటిఫై చేయటంతో.. అనుమతి లేకుండా ప్రైవేటు ప్రాపర్టీలోకి ప్రవేశించారన్న అభియోగాలపై పోలీసులు సీజేపీ నేతలను అరెస్టు చేశారు. కన్నాట్‌ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరిపై బీఎన్‌ఎస్ 223 (ఏ), 332, 61(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌లో కూడా బీఎన్‌ఎ్‌స 221, 115 (2), 132, 121 (1), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిని బుధవారం ఉదయం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా.. అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌లకు న్యాయమూర్తి జ్యుడీషియల్‌ కస్టడీ విధించినట్లు పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరు ప్రైవేటు ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా ప్రవేశించి, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాలను తీహార్‌ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.


జాతీయ పతాకాన్ని ఎగరేసినా నేరమా: దీప్కే

తమ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపటంపై సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగపూర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు. ‘సౌరవ్‌, అశులను 5 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. వారు చేసిన నేరం ఏంటి? జాతీయ పతాకాన్ని ఎగురవేయటం నేరమా? ప్రధాని మోదీని ఒక్కటే అడుగుతున్నా.. మీకు ఇంత పిరికితనం ఎందుకు? ఎమర్జెన్సీ విధించాలనుకుంటే.. మీకు ఆ దమ్ముంటే అధికారికంగానే దేశంలో ఎమర్జెన్సీ విధించండి. గతంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా జాతీయ పతాకాన్ని ఎగువేసినందుకు జైల్లో పెట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఆయన నాగపూర్‌లోని దీక్షభూమిని సందర్శించి అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. ‘మనదేశం రాజ్యాంగ నియమాల ప్రకారం.. బీఆర్‌ అంబేద్కర్‌ సిద్ధాంతాలపై ఆధారపడి నడుస్తోంది. దేశంపై ఆరెస్సెస్‌ సిద్ధాంతాలను రుద్దాలని మోదీతోపాటు ఎవరు ప్రయత్నించినా అది ఫలించదు’ అని వ్యాఖ్యానించారు. దాస్‌, రాంకాను జైలుకు పంపినందుకు నిరసనగా ఢిల్లీలోని కన్సాట్‌ప్లేస్‌లో శుక్రవారం జాతీయ పతాకాలను ఎగురవేసి నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాగా, బుధవారం నాగపూర్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న దీప్కేకు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టు నుంచి దీప్కే బయటకు వస్తుండగా ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ.. ‘దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు?’ అని ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి

విదేశాల్లో భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. కేంద్రం స్పష్టీకరణ

తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!

Updated Date - Oct 15 , 2026 | 04:56 AM