Share News

ముంబై అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు ఏడేళ్ల జైలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:03 AM

ముంబై అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు చెన్నై సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ గుర్తింపుతో పాస్‌పోర్టు పొందిన 2002నాటి కేసులో ఈ తీర్పు చెప్పింది.. ఇప్పటికే ఇతర క్రిమినల్‌ కేసుల్లో...

ముంబై అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు ఏడేళ్ల జైలు

  • తీర్పు చెప్పిన చెన్నై సీబీఐ కోర్టు

చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ముంబై అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు చెన్నై సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ గుర్తింపుతో పాస్‌పోర్టు పొందిన 2002నాటి కేసులో ఈ తీర్పు చెప్పింది.. ఇప్పటికే ఇతర క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలిన ఛోటా రాజన్‌, ప్రస్తుతం తిహార్‌ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై పేలుళ్లతో సహా పలు కేసుల్లో ఛోటా రాజన్‌ ముంబై పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్నాడు. అతడు మొదట్లో దావూద్‌ ఇబ్రహీంకు సన్నిహితుడు. ఆ తర్వాత అతడికి ప్రత్యర్థిగా మారాడు. దాదాపు 20 ఏళ్లపాటు భారత పోలీసులకు చిక్కకుండా విదేశాల్లో తల దాచుకున్నాడు. ఆ తర్వాత 2015లో ఇంటర్‌పోల్‌ సాయంతో ఇండోనేషియాలో అతడిని అరెస్టు చేశారు. కాగా ఛోటా రాజన్‌ చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని మోసం చేసి, నకిలీ పత్రాలతో భారతీయ పాస్‌పోర్టు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడిపై ఉన్న ఆరోపణలు వాస్తవమని సీబీఐ విచారణలో తేలింది. అతడి అసలు పేరు రాజేంద్ర సదాశివ్‌ నికల్జీ కాగా, విజయ కదమ్‌ అనే నకిలీ పేరుతో చెన్నైలో పాస్‌పోర్ట్‌ కోసం నకిలీ పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకున్నాడు. 2004లో, ఈ కేసులో సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేయగా, సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్‌ను దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 55వేల జరిమానా విధిస్తూ గురువారం తుది తీర్పిచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 06:03 AM