ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. మైనింగ్ గొడవల్లో స్థానిక నేత సజీవ దహనం
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:59 PM
ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాల విషయంలో ఇరు వర్గాల మధ్య చలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నేత ఒకరు సజీవదహనమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నేత, జన్‌పద్ పంచాయతీ మాజీ ప్రెసిడెండ్ భరత్ సింగ్ సజీవదహనమయ్యారు. కొరియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, స్థానికంగా ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్‌ను భరత్ సింగ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ త్రిపాఠీ వర్గంతో భరత్ సింగ్‌కు వివాదం మొదలైంది. ఇసుక తవ్వకాల కోసం వాడే టిప్పర్ ట్రక్‌లు త్రిపాఠీ కుటుంబానికి చెందినవని స్థానికులు తెలిపారు. దీంతో, ఇసుక తరలింపు, చెల్లింపుల విషయంలో భరత్ సింగ్, త్రిపాఠీ వర్గాల మధ్య వివాదం మొదలైంది. చివరకు ఇది ఆధిపత్య పోరుగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలకు సంబంధించి తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు భరత్ సింగ్ నౌగెయిన్ గ్రామానికి వెళ్లారు. దీంతో, అక్కడ వివాదం చెలరేగగా భరత్ సింగ్ ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారును కొందరు అడ్డగించారు. తప్పించుకునే వీలులేకుండా కారుకు ముందు, వెనుక లారీలను అడ్డుపెట్టారు. ఆ తరువాత కారుపై పెట్రలో పోసి నిప్పటించడంతో భరత్ సింగ్ సజీవదహనమయ్యారు. భరత్ సింగ్‌తో పాటు కారులో ఉన్న విరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ కూడా కాలిన గాయాలతో కన్నుమూశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మయాంక్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని మృతుల కుటుంబం డిమాండ్ చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని ఏఎస్పీ సురేషా చౌబే తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ
భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి..