దివ్యాంగులకు మరింత ఆసరా
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:44 AM
దేశంలోని పేద కుటుంబాలకు, ప్రత్యేకించి దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కనీస వయసు నిబంధన ఎత్తివేత..
పుట్టినప్పటి నుంచే పింఛను
అర్హత వైకల్యం 40 శాతానికి తగ్గింపు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దేశంలోని పేద కుటుంబాలకు, ప్రత్యేకించి దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని (ఎన్ఎస్ఏపీ) పునర్ వ్యవస్థీకరించి, 2030-31 వరకు ఐదేళ్ల పాటు రూ.53,428 కోట్ల వ్యయంతో కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం పేరును ‘ప్రధాన మంత్రి సామాజిక సహాయతా యోజన’గా మార్చింది. అంతేకాకుండా ఇప్పటివరకు దివ్యాంగుల పింఛను పొందడానికి ఉన్న 18 ఏళ్ల కనీస వయోపరిమితి నిబంధనను రద్దు చేసింది. దీంతో పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు పింఛను మంజూరు చేయనున్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల ప్రకారం.. వైకల్య పరిమితిని 80 నుంచి 40 శాతానికి తగ్గించడంతో పాటు ఇతర క్యాటగిరీల సంక్షేమ పథకాలతో పోలిస్తే దివ్యాంగులకు అందించే సహాయం కనీసం 25 శాతం ఎక్కువగా ఉండాలని క్యాబినెట్ నిర్ణయించింది. అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 11.40 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) కింద రూ.2009.61 కోట్ల చెల్లింపునకు ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సామాజిక సహాయతా యోజన కింద 79 ఏళ్లలోపు వయసు వారికి నెలకు రూ.375, 80 ఏళ్లు, ఆపైబడిన వయసు వారికి నెలకు రూ.625 చొప్పున కేంద్రం తన వాటాగా అందిస్తుంది (దీనికి రాష్ట్రాలు ఇచ్చే వాటా అదనం). వృద్ధులు, వితంతువుల పింఛను పథకాలు, కుటుంబ ప్రయోజన పథకం ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొనసాగుతాయి. కేంద్ర మంత్రివర్గ తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంతో పాటు దాని అనుబంధ పథకాల పేర్ల మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకాన్ని ప్రధానమంత్రి వృద్ధావస్థ పెన్షన్ యోజనగా, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకాన్ని ప్రధానమంత్రి విధవా పెన్షన్ యోజనగా, ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పింఛను పథకాన్ని ప్రధానమంత్రి దివ్యాంగజన్ పెన్షన్ యోజనగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజనగా పేరు మార్చింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా దుర్గాపూజ లేదా దసరా సెలవులకు ముందు పీఎల్బీని కేంద్రం చెల్లిస్తుంది. ఈ ఏడాదీ 11.40 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు చెల్లించనుంది. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గరిష్ఠంగా రూ.17,591 బోనస్ అందుతుంది.
చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం: కిషన్రెడ్డి
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం సమాజంలో అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకు కొండంత అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘పుట్టిన మొదటి రోజు నుంచే దివ్యాంగ చిన్నారి సంరక్షణ భారం కుటుంబంపై పడుతుంది. అందువల్ల 18 ఏళ్లు వచ్చేవరకు వేచి ఉండాల్సిన నిబంధనను తొలగించాం. ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంద’ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశాల్లో భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. కేంద్రం స్పష్టీకరణ
తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!