సీట్ల పెంపు 50శాతం
ABN , Publish Date - May 19 , 2026 | 04:04 AM
లోక్‌సభ, శాసనసభల్లో ఇప్పుడున్న సీట్లను 50 శాతం పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని..
కేంద్రం యోచన.. జూన్‌లో మళ్లీ పార్లమెంటు సమావేశాలు?
ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం
సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకురావచ్చని అంచనా
ఈసారి ఎలాగైనా బిల్లుల్ని ఆమోదించుకునేలా వ్యూహరచన
ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు!
జూన్ 9కి సర్కారుకు రెండేళ్లు
భారీగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ
30 మందికి ఉద్వాసన పలికే అవకాశం.. ఇప్పటికే రంగం సిద్ధం!
ఈ నెలాఖరుకు పలువురు మంత్రులకు బీజేపీలో బాధ్యతల అప్పగింత
వారి స్థానంలో కొత్తవారికి అవకాశం
నితీశ్‌కు రైల్వే లేదా వ్యవసాయం
న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, శాసనసభల్లో ఇప్పుడున్న సీట్లను 50 శాతం పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని.. సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కసరత్తు జరుపుతోంది. గత నెలలో వివిధ రాష్ట్రాల ఎన్నికల మధ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. మహిళా రిజర్వేషన్, లోక్‌సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టటం.. ప్రతిపక్షాల మూకుమ్మడి వ్యతిరేకతతో ఆ బిల్లులు వీగిపోవటం తెలిసిన విషయమే. ఆ సమయంలో.. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తక్కువ జనాభా ఉన్న దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న కారణంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వాటిని ఒప్పించటానికి.. జనాభా ప్రాతిపదికన కాకుండా, 50 శాతం చొప్పున అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను పెంచటానికి కేంద్రం ముందుకొచ్చింది. మౌఖికంగా ఈ హామీ ఇచ్చింది. అయినప్పటికీ, ప్రతిపక్షాలు అంగీకరించలేదు. దీంతో బిల్లులు ఆమోదం పొందకుండానే ఆ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలువుదీరాయి. పశ్చిమ బెంగాల్‌లో ఘన విజయంతో బీజేపీ ఉత్సాహం ఇనుమడించింది. ఈ నేపథ్యంలోనే, మరోసారి పార్లమెంటు సమావేశాలపై కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు దృష్టి సారించింది. మహిళా రిజర్వేషన్, లోక్‌సభలో సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం.
జూన్ రెండో వారంలో ఈ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాల తేదీలను నిర్ణయిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. సదరు బిల్లులకు సంబంధించి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నోట్ కూడా తయారైందని, ఈ నెలాఖరులోపు క్యాబినెట్ సమావేశం జరిపి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. ఈసారి లోక్‌సభ, శాసనసభల సీట్లను 50శాతం పెంచుతూ బిల్లులో క్లాజులు చేర్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి. తద్వారా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి, బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించవచ్చని సర్కారు భావిస్తున్నట్లుగా తెలిపాయి. ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. సాధ్యమైనంత మేరకు ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా చంద్రబాబును అమిత్‌షా కోరినట్లు తెలిసింది. అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.
మంత్రివర్గం నుంచి 30 మందికి ఉద్వాసన?
మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే బీజేపీ ఆఫీసు బేరర్ల నియామకం, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెడతారని సమాచారం. జూన్ 9వ తేదీతో మోదీ మూడో దఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వవస్థీకరణను భారీ ఎత్తున జరిపే అవకాశాలున్నాయి. దాదాపు 30 మంది మంత్రులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వారిలో 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్నవారు, రాజ్యసభ పదవీకాలం పూర్తయిన వారు, పనితీరులో వెనుకబడినవారు ఉన్నట్లు సమాచారం. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. జేడీయూ అధినేత నితీశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని, ఆయనకు వ్యవసాయ లేదా రైల్వే శాఖను అప్పగించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.