10 వేల కోట్లతో విమాన ఇంధన స్థిరీకరణ నిధి
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:28 AM
దేశీయ విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారీగా పెరిగిన విమాన ఇంధన...
ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర
న్యూఢిల్లీ, జూన్ 3: దేశీయ విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారీగా పెరిగిన విమాన ఇంధన (ఏటీఎఫ్) భారం నుంచి రక్షించేందుకు రూ.10,000 కోట్లతో విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి పేరుతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ)కు బదిలీ చేస్తుంది. అందుకు ప్రతిగా ఓఎంసీలు దేశీయ విమానయాన సంస్థలకు లీటరు ఏటీఎ్‌ఫను రూ.75.6 చొప్పున సరఫరా చేయాలి. అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలు అంతకంటే ఎక్కువ ఉంటే.. ఆ వ్యత్యాసాన్ని ఈ నిధి ద్వారా ఓఎంసీలకు అందజేస్తారు. ఏటీఎఫ్ అంతర్జాతీయ ధరలు సాధారణ స్థితికి చేరిన తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ వ్యత్యాసాన్ని భారత సంచిత నిఽధికి జమ చేస్తాయి. పశ్చిమాసియా యుద్ధంతో ఈ ఏడాది మార్చిలో లీటరు రూ.60.5గా ఉన్న ఏటీఎఫ్ ధర.. మే నాటికి రెండున్నర రెట్లు పెరిగి రూ.142కు చేరింది. దీంతో దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ సంక్షోభం నుంచి వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక నిధితో ముందుకొచ్చింది. అలాగే.. ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఉపకరించే పథకానికీ క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ‘బీఎస్-4’ ప్రమాణాలతో నడిచే పాత ట్రక్కులు, బస్సులను తుక్కుగా మార్చి.. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన/ విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసేలా వాహన యజమానులను ప్రోత్సహించే పథకం ఇది. రూ.9,585 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ పథకంలో భాగంగా.. బీఎస్-4 వాహనాలను తుక్కుగా మార్చినవారికి/వేరే రాష్ట్రాల్లో విక్రయించినా కొత్త వాహనాల కొనుగోలుకు తీసుకున్న రుణాలపై ఐదేళ్లపాటు 5శాతం వడ్డీ రాయితీని, వాహన విభాగాన్ని బట్టి నెలకు రూ.4,800 దాకా విలువ చేసే ఇంధన ఓచర్లను ప్రభుత్వం అందిస్తుంది. కొత్తవాహనం కొనుగోలుపై కంపెనీలు 8% డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..