Share News

మార్కెట్‌ బడ్జెట్‌?

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:15 AM

దేశంలో వినియోగానికి ఊపునిచ్చి, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్‌ ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

మార్కెట్‌ బడ్జెట్‌?

  • ప్రజల వినియోగం పెంచే దిశగా కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు, నిర్ణయాలు

  • ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను కల్పించే లక్ష్యం

  • ట్రంప్‌ సుంకాల ప్రభావిత రంగాలపై దృష్టి

  • ఐటీ కొత్త విధానంలోనూ డిడక్షన్లకు చోటు?

  • రోడ్డు, రైల్వే, మౌలిక వసతులకు ప్రాధాన్యం

  • రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు

  • నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో వినియోగానికి ఊపునిచ్చి, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్‌ ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాదే కొత్త ఆదాయ పన్ను విధానంలో మినహాయింపులు, ఇటీవల జీఎస్టీ తగ్గింపును అమలు చేసిన కేంద్రం... ఈసారి మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక, మార్కెట్‌ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థలోకి నిధులను పంప్‌ చేయడం కోసం రహదారులు, రైల్వే, పట్టణ రవాణా, పారిశ్రామిక కారిడార్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేంద్రం భారీగా వెచ్చించవచ్చని అంటున్నారు. భారత్‌పై అమెరికా 50శాతం సుంకాలు విధించిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ కావడంతో.. సుంకాలతో నష్టపోతున్న రంగాలను ఆదుకోవడానికి చర్యలు ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


కొత్త ఆదాయ పన్నులో మినహాయింపులు!

గత ఏడాది కొత్త ఆదాయ పన్నులో శ్లాబులను గణనీయంగా పెంచినా ప్రయోజనం పూర్తిస్థాయిలో దక్కడం లేదని ఉద్యోగులు, మధ్య తరగతి వారి నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.1.25 లక్షలకు పెంచాలని, గృహ రుణాల వడ్డీతోపాటు అసలుకు కూడా మినహాయింపు వర్తింపజేయాలనే డిమాండ్లు ఉన్నాయి. వీటిపై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో పింఛన్‌దారులకూ ప్రయోజనం కలిగించే చర్యలు ఉండవచ్చని చెబుతున్నారు. బ్యాంకు డిపాజిట్లను ప్రోత్సహించేదిశగా, క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను విధింపులో రాయితీలు ఉండొచ్చని అంటున్నారు. గిగ్‌ వర్కర్లు, రోజువారీ వేతన కార్మికులకు ఆరోగ్య బీమా, పింఛన్‌, ఇతర సామాజిక భద్రత కల్పించాలన్న ప్రతిపాదనలపైనా సానుకూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


ఈసారి మరింత ‘రక్షణ’..

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ను దీటుగా ఎదుర్కొన్నా... ఈ యుద్ధం భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఈసారి రక్షణ బడ్జెట్‌ను మరింతగా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి కొనుగోళ్లతోపాటు దేశీయంగా రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక రోడ్డు, రైలు ప్రాజెక్టులు, దేశీయంగా విమానయానాన్ని పెంచే లక్ష్యంతో చేపట్టిన ఉడాన్‌, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులు గణనీయంగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.


ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు

అమెరికా సుంకాలతో భారత్‌లోని చాలా రంగాలపై ప్రభావం పడటం, అంతర్జాతీయంగా నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కీలక ఆర్థిక సంస్కరణలను ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా చర్యలు ఉండొచ్చని.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రక్రియలను వేగవంతం చేయవచ్చని పేర్కొంటున్నారు. మేకిన్‌ ఇండియాకు ఊతనిచ్చేందుకు కస్టమ్స్‌ సుంకాల హేతుబద్ధీకరణ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం వంటివి చేపట్టవచ్చని అంటున్నారు. అదే సమయంలో పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్‌ పరిశ్రమలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాల రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించవచ్చని చెబుతున్నారు. రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెంచేందుకు మరిన్ని దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని వివరిస్తున్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు కోరిన విధంగా పూర్వోదయ పథకంలో భాగంగా ఏపీకి నిధులు కేటాయించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

చరిత్రలో తొలిసారిగా ఆదివారం బడ్జెట్‌!

భారత దేశ చరిత్రలో తొలిసారిగా ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా సెలవు రోజుల్లో కాకుండా సాధారణ పని దినాల్లోనే బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉదాహరణకు 1999లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం వచ్చింది. దానితో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా.. దానికి ఒకరోజు ముందే అంటే ఫిబ్రవరి 27వ తేదీ శనివారం రోజున పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. గతంలో ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టేవారు. కొన్నేళ్ల క్రితమే ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 11 గంటలకే ప్రవేశపెట్టేలా మార్పులు తెచ్చారు. ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చినా కూడా.. పార్లమెంటు సమావేశాలు నిర్వహించి, బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం

వికసిత బడ్జెటేనా

Updated Date - Feb 01 , 2026 | 07:16 AM