వికసిత బడ్జెటేనా!
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:35 AM
అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా భారత్ మాత్రం వృద్ధి జోరును కొనసాగిస్తోంది. అమెరికా సుంకాల ప్రభావం పడుతున్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం ..
అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా భారత్ మాత్రం వృద్ధి జోరును కొనసాగిస్తోంది. అమెరికా సుంకాల ప్రభావం పడుతున్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ఆదివారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వికసిత భారత్ లక్ష్యాల సాధన దిశగానే చర్యలు ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ప్రధానంగా తయారీ, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది.
జీడీపీ వృద్ధి రేటు
ప్రస్తుతం మన జీడీపీ వృద్ధి రేటు మంచి జోరు మీద ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. మార్చితో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా మన జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక ప్రపంచంలో మరే పెద్ద దేశమూ ఈ స్థాయిలో జీడీపీ వృద్ధి రేటు నమోదు చేయడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇదే జోరును కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంచనా.
ద్రవ్యోల్బణం
గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో ధరల సెగ తక్కువగానే ఉంది. అయితే తాజాగా పెరుగుతున్న ఆహార ధరల సెగ మాత్రం అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను ఒకింత భయపెడుతోంది. దీంతో ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఏ చేస్తుందనే దానిపై ఒకింత ఆసక్తి నెలకొని ఉంది.
ద్రవ్య లోటు
గత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీలో 4.6 శాతంగా ఉన్న ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 4.4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరో రెండు నెల ల పాటు అదనపు ఖర్చులేమీ లేకపోతే ఇది ఆచరణ సాధ్యమే. దీంతో ఫిబ్రవరి 1న ప్రకటించే 2026 -27 బడ్జెట్‌లో ద్రవ్య లోటును 4.2 శాతం వద్ద కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారని మార్కె ట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
మూలధన వ్యయాలు
ఈసారి బడ్జెట్‌లోనూ మూలధన వ్యయ కేటాయింపులు కీలకం కానున్నాయి. మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మౌలికాభివృద్ధి కోసం మూలధన కేటాయింపులను భారీగా పెంచుకుంటూ వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మూలధన వ్యయాల కోసం రూ.11.2 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో మరో 10-15 శాతం మేర పెంచి రూ.12 లక్షల కోట్లు దాటించవచ్చన్న అంచనాలున్నాయి. ప్రధానంగా రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ సరఫరా, రక్షణ, పట్టణ రవాణా రంగాలకు ఈసారి ప్రాధా న్యం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంధన పరివర్తనం, భద్రతపై దృష్టి
సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఈ రంగానికి మద్దతుగా మరిన్ని చర్యలు చేపట్టవచ్చు. పునరుత్పాదక ఇంధనంతో పాటు గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజీ, ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని తాయిలాలు లభించవచ్చు. అంతేకాదు, శుద్ధ ఇంధన ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు, పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించే అవకాశముంది. అలాగే, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన భద్రతపైనా ప్రభుత్వం దృష్టిసారించవచ్చు. ఇందుకోసం దేశీయంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి, వ్యూహాత్మక నిల్వల సామర్థ్యం పెంపు కోసం బడ్జెట్లో కేటాయింపులు జరిపేందుకు అవకాశాలున్నాయి.
పన్నులు
2025-26 బడ్జెట్లోనే వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పైగా పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈసారి పెద్దగా మార్పు లు జరపకపోవచ్చు. ఒకవేళ ఏమైనా మార్పులు చేసినా, మధ్యతరగతికి మరింత ఊరటనివ్వడంతో పాటు వస్తు వినియోగం పెంచే దిశగా చర్యలుండే అవకాశం ఉంది. కార్పొరేట్ పన్నుల్లోనూ మార్పులు ఉండకపోవచ్చు. ఎగుమతులు, తయారీ రంగాలకు మరింత మద్దతు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో స్థిరత్వాన్ని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల అమ్మకాలపై వచ్చే మూలధన లాభాల పన్నుల్లో ప్రతికూల మార్పులు కూడా ఉండకూడదని మదుపరులు కోరుకుంటున్నారు.
ఎఫ్‌ఎంసీజీ రంగం
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వినియోగం గాడినపడింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వినియోగం ఇంకా కొవిడ్ ముందు స్థాయికి రాలేదు. ఈ ప్రాంతాల ప్రజల ఆదాయం, వినియోగం పెంచేందుకు ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో ఏమైనా ప్రత్యేక చర్యలు ప్రకటిస్తారా? అని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
సీనియర్ సిటిజన్లు
రిటైరై జీవితం మలి సంధ్యలో ఉన్న అనేక మంది పండుటాకులకు వడ్డీ ఆదాయమే ప్రధాన ఆదాయ వనరు. వీరికి వచ్చే వడ్డీ ఆదాయం రూ.50,000 దాటితే సెక్షన్ 80 టీటీబీ కింద పన్ను పోటు తప్పదు. ఏటికేటికి ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ మినహాయింపు ఏ మా త్రం చాలదు. ఆర్థిక మంత్రి కనీసం ఈ బడ్జెట్‌లో అయినా ఈ వడ్డీ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.లక్ష వరకు పెంచాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. అలాగే ఈ వడ్డీ ఆదాయంపై విధిస్తున్న టీడీఎ్‌సను కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లతో పాటు సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న రూ.50,000 మినహాయింపును రెట్టింపు చేయాలని కోరుతున్నారు.
తయారీ- ఉద్యోగాల కల్పన-ఎంఎస్ఎఈలు
దేశంలో తయారీకి ఊతమిచ్చేందుకు ఈ సారి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశముంది. అలాగే, ఉద్యోగాల కల్పనకు దోహదపడేలా నైపుణ్య శిక్షణ, అప్రెంట్‌షిప్ పథకాలను ప్రకటించవచ్చని అంచనా. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు మరిన్ని కేటాయింపులతో పాటు క్రెడిట్ గ్యారెం టీ మద్దతును కూడా పెంచే అవకాశాలున్నాయి. అంతేకాదు, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేయవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News