డిజిటల్ అరెస్టులకు సీబీఐ చాట్‌బాట్‌తో చెక్!
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:51 AM
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు తక్షణ సహాయం...
నేడు ‘అభయ్’ను ప్రారంభించనున్న సీజేఐ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు తక్షణ సహాయం అందజేసేందుకు ఏఐ అధారిత చాట్‌బాట్ ‘అభయ్’ను సిద్ధం చేసింది. డిజిటల్ అరెస్టు స్కాంలకు సంబంధించి సీబీఐ పేరుతో జారీ చేసే నోటీసుల ప్రామాణికతను ధ్రువీకరించడంలో ఈ చాట్‌బాట్ ఉపయోగపడనుంది. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ స్మారకార్థం సోమవారం నిర్వహించే కార్యక్రమంలో ‘అభయ్’ చాట్‌బాట్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీజేఐ ‘సైబర్ నేరాల సవాళ్లు- పోలీసు, న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. ప్రస్తుతానికి సీబీఐ నోటీసుల ధ్రువీకరణకే పరిమితం కానున్న ఈ చాట్‌బాట్.. భవిష్యత్తులో ఇతర సంస్థ (ఐటీ, కస్టమ్స్)ల నోటీసులకూ విస్తరించే అవకాశముంది. దేశంలో సైబర్, డిజిటల్ మోసాల ద్వారా నేరగాళ్లు ఏకంగా రూ.54 వేల కోట్లు దోచుకున్నారని.. ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువని ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో