Share News

భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:31 PM

భూరికార్డులు పౌరసత్వానికి కచ్చితమైన రుజువులు కావని కలకత్తా హైకోర్టు తాజాగా పేర్కొంది. విదేశీయులు కూడా భారత్‌లో భూమి కొనుగోలు చేయొచ్చన్న విషయాన్ని ప్రస్తావించింది.

భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు
Calcutta High Court on Citizenship

ఇంటర్నెట్ డెస్క్: భూరికార్డులు పౌరసత్వానికి కచ్చితమైన రుజువులు కావని కలకత్తా హైకోర్టు తాజాగా పేర్కొంది. విదేశీయులు కూడా భారత్‌లో భూమి కొనుగోలు చేయొచ్చన్న విషయాన్ని ప్రస్తావించింది. భారత్‌లో భూమి కొన్నంత మాత్రాన పౌరులు అయిపోరని పేర్కొంది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నసీర్ ముల్లా అనే వ్యక్తి కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

నసీర్ ముల్లా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ నసీర్ భారత పౌరుడేనని అన్నారు. కేంద్రం మాత్రం ఈ వాదనలను కొట్టి పారేసింది. తాను విదేశీయుడినని నసీర్ స్వయంగా ఒప్పుకున్నాడని తెలిపింది. ఈ నేపథ్యంలో తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు డాక్యుమెంట్లు చూపాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో, ససీర్‌కు చెందిన భూరికార్డులను మాత్రమే అతడి తరఫు లాయర్ సమర్పించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ భూరికార్డులు పౌరసత్వానికి రుజవులు కావని స్పష్టం చేసింది. ఇతర డాక్యుమెంట్స్‌ను సమర్పించేందుకు జులై 20 వరకూ గడువు ఇచ్చింది. గత నెలలో పశ్చిమ బెంగాల్‌లో నసీర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని డిటెన్షన్ సెంటర్‌లో పెట్టారు.


భారత పాస్‌‌పోర్టులు దేశ పౌరసత్వానికి రుజువు కాదని కేంద్రం గత నెలలోనే పేర్కొన్న విషయం తెలిసిందే. వీటిని విదేశీయులకూ ఇచ్చే అవకాశం సాంకేతికంగా ఉండటంతో పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో బాంబే హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాస్‌పోర్టులను పౌరసత్వానికి కచ్చితమైన రుజువుగా పరిగణించలేమని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

సీట్ల పునర్విభజనపై డీఎంకే సంచలన నిర్ణయం

మీ పేరు ముందు డాక్టర్‌ను తొలగించండి: సుప్రీం కోర్టు

Updated Date - Jul 17 , 2026 | 05:42 PM