ఊహించని విషాదం.. కూతురి పెళ్లిలో కన్యాదానం చేస్తుండగా..
ABN , Publish Date - May 17 , 2026 | 05:58 PM
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి పెళ్లిలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. కన్యాదానం చేస్తుండగా పెళ్లి కూతురి తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు.
ముంబై, మే 17: ఓ యువతి పెళ్లిలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. కన్యాదానం చేస్తుండగా పెళ్లి కూతురి తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సింద్‌ఖేడ్ రాజా తాలూకాలోని వర్దాదికి చెందిన కురుమదాస్ భూతేకర్ కూతురు నందినికి జల్నా జిల్లాలోని మంథకు చెందిన ప్రదీప్ ననోతేతో పెళ్లి కుదిరింది. గురువారం పెళ్లి వేడుక జరిగింది. మూడు ముళ్లు పడ్డ తర్వాత.. కురుమదాస్ తన కూతురిని పెళ్లి కొడుకు కుటుంబానికి అప్పగిస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
కురుమదాస్ నేలపై కుప్పకూలిపోయాడు. నీరసం కారణంగా అతడు కుప్పకూలి ఉంటాడని అందరూ అనుకున్నారు. వెంటనే అతడిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కురుమదాస్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా చనిపోయాడని చెప్పారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, కురుమదాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా అతడికి గుండెపోటు వచ్చింది.
గత డిసెంబర్ నెలలో కురుమదాస్ బై పాస్ సర్జరీ చేయించుకున్నాడు. విశ్రాంతి తీసుకోమని అతడికి డాక్టర్లు చెప్పారు. అయితే, కూతురి పెళ్లి ఘనంగా చెయ్యాలన్న ఉద్దేశ్యంతో చాలా శ్రమ తీసుకున్నాడు. స్వయంగా దగ్గరుండి మరీ పెళ్లి ఏర్పాట్లు చూసుకున్నాడు. చివరకు కూతురి పెళ్లిలోనే గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కూతురిని అత్తవారింటికి పంపాల్సిన సమయంలో.. అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, ఈ సంఘటన గురించి తెలిసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..
కువైత్‌లో అట్టహాసంగా తెలుగుదేశం మహానాడు