కువైత్‌లో అట్టహాసంగా తెలుగుదేశం మహానాడు
ABN , Publish Date - May 17 , 2026 | 05:25 PM
కువైత్‌లో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మహానాడును వేడుకగా జరుపుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎక్కడో అరేబియా సముద్ర తీరాన ఉన్న కువైత్‌లో చినుకులు పడితే కడప తడిసిపోతుంది. సుమారు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ శ్రీ అన్నమయ్య జిల్లా ప్రజానీకం కువైత్‌తో మమేకమైపోయింది. రాయలసీమ రాజకీయాల ప్రభావం ఇందుకు మినహాయింపు కాదు. కువైత్ భౌగోళికంగా, జనాభాపరంగా చిన్నదేశమైనప్పటికీ అక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ఉమ్మడి కడప జిల్లా ప్రవాసీయులు తమ ఆసక్తి కారణంగా పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి బలమైన అభిమానులు ఉన్న కువైత్‌లో శుక్రవారం పార్టీ అభిమానులు మహానాడు వేడుకలను తెలుగుదేశం పార్టీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య విమానయానానికి అంతరాయం ఏర్పడి విమాన టికెట్ల ధరలు మూడింతలు పెరిగిన ప్రస్తుత తరుణంలో కార్యక్రమానికి రాయలసీమ నుంచి అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఫొటోలు దిగడానికి పోటీపడటంతో రద్దీ ఏర్పడి కొంచెం అంతరాయం కల్గింది.

కువైత్‌లో కాకుండా ఎక్కడో రాజంపేట సమీపంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించినట్లుగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ప్రత్యేకంగా వచ్చి భావోద్వేగంతో చేసిన ప్రసంగాలు రాయలసీమ రాజకీయ చైతన్యాన్ని రగిలించాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చేసిన ప్రసంగం ఆయన తండ్రి స్వర్గీయ పాలకొండ్రాయుడును గుర్తుకు తేవడంతో అనేక మంది ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ వారసత్వంగా తెలుగుదేశం పార్టీ పట్ల గురుతర బాధ్యత అనేది తమకు దక్కిందని, ఇంటాబయటా ఉన్న ప్రతి ఒక్కరితో ఉన్న అనుబంధానికి తెలుగుదేశం పార్టీ ఒక వారధి అని సుగవాసి అన్నారు.

కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ అభిమానుల ఉత్సాహాన్ని పరిశీలిస్తే, పార్టీకి ఉన్న ఆదరణ అర్థమవుతోందని ముఖ్య అతిథిగా విచ్చేసిన పలమనేరు శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ కువైత్ ప్రవాసాంధ్రుల చిరకాల వాంఛ అయిన రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ అనుమతుల గురించి ప్రస్తావిస్తూ దీన్ని తాను కేంద్ర మంత్రి కె. రాంమోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. ఈ విషయంలో ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.

కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ ప్రముఖుడు, పార్టీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదు.. అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని అన్నారు. దీన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కొనసాగిస్తున్నారని కొనియాడారు. తనకు కువైత్‌లో కాకుండా సుండుపల్లిలో పార్టీ కార్యకర్తల మధ్య ఉన్నట్లుగా అనుభూతి కల్గుతందని సుండుపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రమేష్ నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా కూడా కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు.

తెలుగుదేశం ఎన్నారై టీడీపీ కువైత్ నాయకులు ఉదయ్ ప్రకాశ్, ఓలేటి దివాకర్, రాచూరి మోహన్, ముస్తాక్ ఖాన్, ఓలేటి రెడ్డయ్య చౌదరి, డాక్టర్ కృష్ణ చైతన్య, నారాయణమ్మ, తెలుగు యువత నేత మురళి దుగ్గినేని, కొల్లపమని రమేష్ తదితరులు మహానాడును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా, నందమూరి అభిమానులు తోపాటు ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు చుండు రెడ్డయ్య, వారి కార్యవర్గ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు యువసేన రెడ్డిశేఖర్, వారి కార్యవర్గం ఏపీ టీడీపీ యూత్, మహిళా విభాగం తెలుగు మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, దేవి చౌదరి, అంజలి, బీసీ విభాగం శంకర్ యాదవ్, వారి కార్యవర్గ సభ్యులు, మైనార్టీ విభాగం రహ్మతుల్లా, ఇతర కమిటీ సభ్యులు కూటమి నాయకులు జనసేన పార్టీ కువైత్ అధ్యక్షుడు హరి రాయల్, కార్యవర్గం ఇచ్చిన సహకారానికి నిర్వహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలకు భోజన వసతి కల్పించిన స్కైస్పైసీ రెస్టారెంట్, ఇతరత్రా సహకరించిన నక్షత్ర, హన్వికల సంస్థలను సత్కరించామని వారు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
దుబాయిలో వైభవంగా తెలుగుదేశం మినీ మహానాడు
తెలుగుదేశం మహానాడు.. దద్దరిల్లిన దమ్మాం