బ్రిజ్‌భూషణ్ నిర్దోషి
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:24 AM
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి న్యాయస్థానం ఆయనకు...
మహిళా రెజ్లర్లకు వేధింపుల కేసులో ఆయనపై
ఆరోపణలకు ఆధారాల్లేవన్న ఢిల్లీ కోర్టు
తీర్పుపై రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆక్రోశం
మాజీ ఎంపీ పలుకుబడి ఉపయోగించారు
ప్రభుత్వం, యంత్రాంగం, వ్యవస్థ మొత్తం
ఆయన రక్షణకు పూనుకున్నాయి
తీర్పుపై అప్పీలుకు వెళ్తాం: ఫొగట్
న్యూఢిల్లీ, ఆగస్టు 3: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి న్యాయస్థానం ఆయనకు విముక్తి కల్పించింది. ఆరోపణలకు ఆధారాల్లేవని.. ఆయన్ను నిర్దోషిగా పేర్కొంటూ ఢిల్లీ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్వినీ పన్వర్ సోమవారం తీర్పు వెలువరించారు. సమాఖ్య మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా నిర్దోషిగా ప్రకటించారు. ఆరోపణలు చేసిన రెజ్లర్లలో ఒకరైన వినేశ్ ఫోగట్ ఈ తీర్పుపై ఆక్రోశం వెలిబుచ్చారు. బ్రిజ్‌భూషణ్ తన పలుకుబడిని, రాజకీయ శక్తిని ఉపయోగించారని.. ప్రభుత్వం, యంత్రాంగం, వ్యవస్థ మొత్తం ఆయనకు ఆది నుంచీ రక్షణగా నిలబడ్డాయని ధ్వజమెత్తారు. కోర్టు నిర్ణయంపై పై కోర్టుల్లో అప్పీల్ చేయాల్సిందిగా తమ న్యాయవాదులను కోరినట్లు తెలిపారు. ఆరు సార్లు ఎంపీగా పనిచేసిన బ్రిజ్‌భూషణ్ ఈ తీర్పుపై హర్షం ప్రకటించారు. తాను నిర్దోషినని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని, కోర్టు గౌరవపూర్వకంగా తనను, తోమర్‌ను విడుదల చేసిందని వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువైతే తానే ఉరి వేసుకుంటానని కూడా చెప్పానన్నారు. మహిళా రెజ్లర్లను నాటి డబ్ల్యూఎ్‌ఫఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగికంగా వేధిస్తున్నారంటూ వరల్డ్ చాంపియన్‌షిప్స్ పతక గ్రహీత అయిన ఫోగట్, ఆమె సహచరులు 2023లో చేసిన ఆరోపణలతో దేశం ఉలిక్కిపడింది. ఆమెతో పాటు సహ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద 36 రోజులు ధర్నా చేశారు. ఓ మైనర్ సహా ఏడుగురు రెజ్లర్ల వినతిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. వారిపై అభియోగాలను కోర్టు 2024 మేలో పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టింది. రెండేళ్లకుపైగా ఇన్-కెమేరా ప్రొసీడింగ్స్ నిర్వహించింది. ఈ ఏడాది జూన్‌లో వాదనలు ముగిశాయి. న్యాయాధికారి సోమవారం తీర్పు వెలువరించారు. ఆరుగురిలో ఓ రెజ్లర్ చేసిన ఫిర్యాదుకు తగు ఆధారాల్లేవని కోర్టు బ్రిజ్‌భూషణ్‌కు అప్పట్లోనే విముక్తి కల్పించింది. మైనర్ రెజ్లర్ ఫిర్యాదుపై విడిగా మరో కేసు పెట్టినా.. పోలీసు దర్యాప్తు తర్వాత దానిని మూసివేశారు. కాగా, రెజ్లర్ల ఆరోపణలకు సాక్ష్యాధారాల్లేవని.. సాక్షుల వాంగ్మూలాల్లోనూ స్థిరత్వం లేదని న్యాయాధికారి పేర్కొన్నట్లు నిందితుల తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ తెలిపారు. తీర్పు ఆందోళన కలిగిస్తోందని రెజ్లర్ల తరఫు సీనియర్ న్యాయవాది రెబెకా జాన్ తెలిపారు.
ఇదేనా మహిళా సాధికారత: విపక్షాలు
యువత, మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని బీజేపీ తెగ చెప్పుకొంటుందని.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో బ్రిజ్‌భూషణ్‌ను కోర్టు విముక్తి చేయడమే.. అది చెప్పే సాధికారతా అని విపక్షాలు మండిపడ్డాయి. ‘మేం యువతతో ఉన్నామని ఓ పక్క చెబుతారు. మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడతారు.. మరోవైపు ఇలాంటివి చేస్తారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మరోవైపు, చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. కాగా.. కోర్టు తీర్పు సత్యం విజయమని, యువ రెజ్లర్లు సాధించిన విజయంగా బ్రిజ్‌భూషణ్ కుమారుడు, కైసర్‌గంజ్ బీజేపీ ఎంపీ కరణ్‌భూషణ్‌సింగ్ అభివర్ణించారు.

అమ్మాయిలను బ్రిజ్‌భూషణ్ బెదిరించారు: వినేశ్ ఫోగట్
తామంతా రోడ్డెక్కి.. పాలక పార్టీకి చెందిన శక్తిమంతుడైన నాయకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించేందుకు ఎంతో ధైర్యం కూడగట్టుకోవలసి వచ్చిందని వినేశ్ ఫోగట్ చెప్పారు. కేసు నుంచి పేర్లు ఉపసంహరించుకోవాలంటూ పలువురు బాలికలను బ్రిజ్‌భూషణ్ బెదిరించారని ఆరోపించారు. అయినా చాలా మంది రెజ్లర్లు తమ వెంట నిలిచారని, కోర్టులో పోరాడారని తెలిపారు. కోర్టు బ్రిజ్‌భూషణ్‌ను దోషిగా నిర్ధారించకపోవడం తమను కలచివేసిందని.. తాము ఆశ కోల్పోలేదని.. పోరాటం కొనసాగిస్తామని సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా ‘ఎక్స్’లో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..