Share News

90 ఏళ్ల వృద్ధురాలి కేసు.. విచారణ 2046కు వాయిదా

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:00 AM

జీవిత చరమాంక దశలో రాజీకి ఏమాత్రం అంగీకరించకుండా పరువు నష్టం దావా కొనసాగించడానికే ఓ 90 ఏళ్ల వృద్ధురాలు సిద్ధపడడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది....

90 ఏళ్ల వృద్ధురాలి కేసు.. విచారణ 2046కు వాయిదా

ముంబయి, ఏప్రిల్‌ 29: జీవిత చరమాంక దశలో రాజీకి ఏమాత్రం అంగీకరించకుండా పరువు నష్టం దావా కొనసాగించడానికే ఓ 90 ఏళ్ల వృద్ధురాలు సిద్ధపడడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ‘‘ఇది ‘ఈగో’ల యుద్ధమ’ని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 20ఏళ్ల తరువాత అంటే 2046లో చేపడుతామంటూ కేసును వాయిదా వేసింది. అనంతరం న్యాయవాది చేసిన వినతిని సమ్మతించి రానున్న జూలై నెలలో విచారణ జరిపేందుకు అంగీకరించింది. మంగళ, బుధవారాల్లో న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర జైన్‌ ఏకసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిన ఈ కేసు ఆసక్తి కలిగించింది. తరిణిబెన్‌ దేశాయ్‌(90)కు ముంబయిలోని శ్యాం కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి మధ్య 2015లో వివాదం ఏర్పడింది. తనకు మానసిక వేదన కలిగించినందుకు రూ.20కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆమె 2017లో పరువు నష్టం దావా వేశారు. పరిశీలించిన న్యాయస్థానం క్షమాపణలు చెబితే సరిపోతుందని, కేసు అవసరం లేదని 2018లో సూచించింది. అందుకు తరణిబెన్‌ నిరాకరించింది. తాజాగా మంగళవారం ఈ కేసు జస్టిస్‌ జైన్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇలాంటి కేసుల వల్ల అసలు కేసులు చేపట్టడానికి కోర్టుకు సమయం ఉండడం లేదన్న జస్టిస్‌ జైన్‌.. ‘‘ఈ కేసును రానున్న 20 ఏళ్ల వరకు చేపట్టకూడదు. 2046లో ఓ తేదీన విచారణ జరిగేలా లిస్టు చేయండి’’ అని ఉత్తర్వులిచ్చారు. అయితే, బుధవారం తరణిబెన్‌ న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 05:00 AM