Share News

పార్లమెంటు సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ ప్రయత్నాలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 10:01 PM

జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పార్లమెంటు సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ ప్రయత్నాలు
Parliament Monsoon Session

ఇంటర్నెట్ డెస్క్: జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు సమయం కొంత అనుకూలంగా ఉందని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ సవరణను ఆమోదింపచేసుకునేందుకు లోక్‌సభలో బీజేపీకి ప్రస్తుతం 360 ఎంపీల మద్దతు అవసరం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ప్రస్తుతం 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇటీవల తృణమూల్ నుంచి వేరుపడి ఎన్‌సీపీఐ పార్టీలో విలీనమైన 20 ఎంపీల మద్దతు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు కూడగట్ట గలిగితే ఎన్డీయే సంఖ్యాబలం 335కు చేరుకుంటుంది. చిన్న ప్రాంతీయ పార్టీలు పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో సంఖ్యా బలం 340కు చేరుకున్నట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే గూటికి చేరారు. వీరిని కూడా కలుపుకుంటే ఎన్డీయే సంఖ్యా బలం 346కు చేరుకుంటుంది. శరద్ పవార్ పార్టీ‌కి చెందిన 8 మంది ఎంపీల మద్దతు సాధించగలిగితే ఈ సంఖ్య 354కు చేరుతుంది. అప్పటికీ మేజిక్ మార్కును చేరుకునేందుకు ఎన్డీయేకు ఆరుగురు ఎంపీల మద్దతు అవసరం.


ఈ నేపథ్యంలోనే మిగిలిన ఆరుగురు ఎంపీల మద్దతు కూడగట్టేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, సీఎం ఫడణవీస్ తదితరులతో హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. ఇక సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా కొన్ని షరతులకు లోబడి మద్దతు తెలిపే అవకాశం ఉన్నప్పటికీ ఈ షరతులు బీజేపీకి ఆమోదయోగ్యం కాకపోవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జులై 19న కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలకు అధికార పక్షం తాము ప్రవేశపెట్టబోయే బిల్లులు, ఇతర ఎజెండా గురించి వివరించే అవకాశం ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధం.. కీలక బిల్లులతో కేంద్రం అజెండా

మూసివేసిన బ్రిడ్జిపై పుట్టిన రోజు వేడుకలు.. ఈవెంట్ నిర్వాహకుడిపై కేసు నమోదు..

Updated Date - Jul 16 , 2026 | 10:14 PM