కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:04 AM
యూపీలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది.
హర్‌దీప్‌సింగ్ పురి, బీఎల్ వర్మలకు చుక్కెదురు
ఏడుగురు యూపీ సిటింగ్ ఎంపీలను పక్కన పెట్టిన పార్టీ
కొత్తగా ఎనిమిది మందికి రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక మార్పులు
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చిగురించిన ఆశలు
16న మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక
న్యూఢిల్లీ, అక్టోబరు 5: యూపీలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, మరొక కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ సహా ఏడుగురు సిట్టింగ్ ఎంపీలనూ పక్కన పెట్టి.. కొత్త వారికి అవకాశం ఇచ్చింది. యూపీ మాజీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వెళ్లడంతో, సెప్టెంబర్ 11 నుంచి ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ ఎనిమిది స్థానాలకు బీజేపీ అధిష్ఠానం సోమవారం అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర మంత్రిగా ఉన్న ధరంపాల్ సింగ్‌తోపాటు రాధాకాంత్ ఓజా, ప్రకాశ్‌పాల్, విద్యాసాగర్ సోంకార్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్‌ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్ అవకాశం దక్కించుకున్నారు. అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఈ ఎనిమిది రాజ్యసభ స్థానాలను బీజేపీ సునాయాసంగా గెలుచుకోగలదు. యూపీలోని 10 స్థానాలతోపాటు ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి అక్టోబర్ 16న ఎన్నిక జరగనుంది. వీటితోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీఎస్పీ నేత రామ్‌జీ గౌతమ్ పదవీకాలం తీరిపోనుంది. ఎస్పీ తిరిగి రామ్‌గోపాల్ యాదవ్‌కే మరోసారి అవకాశం కల్పించింది. అలాగే, మరో స్థానం కూడా గెలుచుకునే అవకాశం ఉండడంతో ధనరాజ్ పరిమళ్ నత్వానీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
ఈ మార్పులు దేనికి సంకేతం..?
ముఖ్యంగా వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ పూర్తిగా కొత్తవారినే ఎంచుకోవడం వెనుక.. స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలే కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. అగ్రవర్ణాలు, మహిళలు, ఓబీసీ, షెడ్యూల్డ్ కులాలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల వారిని ప్రసన్నం చేసుకునే ఎత్తుగడను అనుసరించినట్లు కనిపిస్తోంది. అలాగే, పార్టీలో సంస్థాగతంగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న రాజకీయ పునర్‌వ్యవస్థీకరణగా దీన్ని చూడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్‌లో కీలకంగా పనిచేస్తున్న హర్‌దీప్ సింగ్ పురికి టికెట్ ఇవ్వకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడం, సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పురి పేరు దర్శనమివ్వడం ఆయన పదవికి ఎసరు పెట్టాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా పురి, బీఎల్ వర్మలకు తిరిగి అవకాశం ఇవ్వకపోవడం.. ఇటీవలే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణపై అంచనాలు బలపడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్