Share News

మమత ఓటుబ్యాంకు బద్దలు

ABN , Publish Date - May 05 , 2026 | 05:07 AM

పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ.. ఈదఫా అనూహ్య పరాజయం చవిచూశారు. ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీ చేతిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ .....

మమత ఓటుబ్యాంకు బద్దలు

  • మహిళల ఓట్లను లాగేసిన బీజేపీ!

  • సందేశ్‌ఖాలి, ఆర్‌జీ కర్‌ ఘటనలతో టీఎంసీ సర్కారుపై అతివల ఆగ్రహం

  • బాధితులకు టికెట్లు ఇవ్వడం ద్వారా దానిని సొమ్ము చేసుకున్న బీజేపీ

  • బూత్‌ స్థాయిలో పార్టీ బలోపేతం.. చొరబాట్లు ప్రధాన ప్రచారాస్త్రం!

పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ.. ఈదఫా అనూహ్య పరాజయం చవిచూశారు. ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీ చేతిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఘోరంగా దెబ్బతింది. సీఎంగా ఉన్న ఈ 15 ఏళ్లలో మమత ప్రత్యేకంగా మహిళా ఓటుబ్యాంకు సృష్టించుకున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో మనసు చూరగొన్నారు. ముఖ్యంగా లక్ష్మీర్‌ భాండార్‌ స్కీం కింద పేద మహిళల ఖాతాల్లో నెలనెలా రూ.1,500 జమచేసే పథకం, బాలికలకు ‘కన్యాశ్రీ’ కింద విద్యాసాయం, యువతుల పెళ్లిళ్లకు ‘రూపశ్రీ’.. ఇలా అనేక స్కీంలు అమలు చేశారు. కానీ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు, హత్యలు పెరిగాయు. సందేశ్‌ఖాలిలో మహిళలపై లైంగిక దోపిడీ, ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం, కస్బా లా కాలేజీలో అత్యాచారం, పార్క్‌ స్ట్రీట్‌, కామ్‌దునీ గ్యాంగ్‌రేప్‌లు, హాస్‌ఖాళీ హత్యాచారం, దుర్గాపూర్‌ మెడికల్‌ కాలేజీలో అత్యాచారం.. ఇలా ఎన్నో ఘో రాలు జరిగాయి. చాలా కేసుల్లో టీఎంసీ నేతల ప్రమేయం ఉంది. బీజేపీ ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా మలచుకుని మమత ఓటుబ్యాంకును దెబ్బతీసింది. మమత ఓటమికి రాజకీయ విశ్లేషకులు ఐదు ప్రధాన కారణాలు చెబుతున్నారు.

బూత్‌ నిర్వహణ భేష్‌..

బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తేనే విజయాలు సాధ్యమని విశ్వసించే పార్టీల్లో బీజేపీ మొదటిది. బెంగాల్లోనూ దీనిని పకడ్బందీగా అమలు చేసింది. పన్నా ప్రముఖ్‌, శక్తి కేంద్రాలను ఏర్పాటుచేసి ఓటర్లకు చేరువైంది. అవసరమైన చోట అదనపు కార్యకర్తలను నియమించడం, సభ్యత్వ నమోదు డ్రైవ్‌ల ద్వారా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసింది. అమిత్‌షా తరచూ స్థానిక నేతలతో భేటీలు ఏర్పాటు చేసి ఢిల్లీ నాయకత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగారు.


ప్రభుత్వ వ్యతిరేకత.. శాంతిభద్రతలు..

ఈ రెండు అంశాలపై విస్తృత ప్రచారం చేసి బీజేపీ బాగానే లబ్ధి పొందింది. అన్నిటినీ మించి టీఎంసీ నేతల అవినీతి, పలు కుంభకోణాల్లో చిక్కుకోవడం.. ఈడీ సోదాల్లో వందల కోట్లు బయటపడడం వంటివి టీఎంసీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. హింసాత్మక ఘర్షణల్లో టీఎంసీ నేతల ప్రమేయం, వారిని కాపాడేందుకు మమత ప్రభుత్వం ప్రయత్నించడంతో జనం బీజేపీలో ప్రత్యామ్నాయం చూసుకున్నారని టీఎంసీ ముఖ్య నేతలు సైతం అంటున్నారు.

‘పరాయి’ ముద్రకు రాంరాం

బీజేపీ విస్తరణను అడ్డుకోవడానికి మమత మొదటి నుంచీ దానిపై ‘పరాయి’ ముద్ర వేశారు. ఢిల్లీ పార్టీ అని ప్రచారం చేశారు. దీనిని ఎదుర్కోవడానికి బీజేపీ బాగా కసరత్తుచేసింది. బెంగాలీ సంస్కృతి, గుర్తింపులో తానూ భాగమని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. ‘భూమిపుత్రుడు’ నినాదాన్ని అమిత్‌షా తెరపైకి తెచ్చారు. బీజేపీ గెలిస్తే బెంగాల్‌ గడ్డపై పుట్టిన నేతే తదుపరి సీఎం అవుతారని ప్రకటించారు. మోదీ, ఇతర జాతీయ నేతలు ప్రతి సభ చివరిలో ‘జై మా దుర్గా, జై మా కాళీ’ అని నినదించారు. స్థానిక అంశాలకు ప్రాచుర్యం కల్పించడం.. రాష్ట్ర నేతలకు ప్రాధాన్యం, బెంగాలీ పండుగల్లో పాల్గొనడం వంటివి బీజేపీ విజయానికి దోహదపడ్డాయని అంటున్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌


చొరబాటుదారులే ఓటుబ్యాంకు..

బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులిచ్చి టీఎంసీ ఓటుబ్యాంకుగా మలచుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ దీన్ని ప్రచారాస్త్రంగా చేసుకుంది. చొరబాటుదార్లతో స్థానిక బెంగాలీల ఉనికే ప్రశ్నార్థకమవుతోందని.. వనరులన్నిటినీ మమత వారికే దోచిపెడుతోందని ప్రచారం చేసింది. ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)లో పలువురు చొరబాటుదారుల ఓట్లు పోయాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. సరిహద్దుల్లో మరింత నిఘా పెంచుతామని.. అక్రమ శరణార్థులను బంగ్లాదేశ్‌ తరిమేస్తామని అమిత్‌షా పదే పదే ప్రకటిస్తూ వచ్చారు.

బాధిత మహిళలను ముందుపెట్టి ప్రచారం..

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ-షా ప్రత్యేక కసరత్తు చేశారు. సందేశ్‌ఖాలి, ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో హత్యాచార ఘటనల వంటివి.. రాష్ట్రంలో శాంతిభద్రతల ఘోరవైఫల్యానికి నిదర్శనంగా నిలిచాయి. పైగా టీఎంసీ నేతల పాత్ర ఉండడం.. వారిని మమత ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నించడంతో మహిళల్లో ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. దీనిని పసిగట్టిన బీజేపీ.. బాధిత మహిళలను ఎన్నికల బరిలో దించింది. సందేశ్‌ఖాలి బాధితురాలు రేఖా పాత్రాను హింగల్‌గంజ్‌లో, ఆర్‌జీ కర్‌ ఆస్పతిలో హత్యాచారానికి గురైన విద్యార్థిని తల్లి రత్నా దేబ్‌నాథ్‌ను పనిహాటీలో అభ్యర్థులుగా నిలిపింది. మహిళల గౌరవాన్ని కాపాడతామని.. వారికి సంపూర్ణ రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని ప్రధాని మోదీ ప్రతి సభలోనూ నొక్కిచెప్పారు. అలాగే నెలనెలా మహిళల ఖాతాల్లో రూ.3 వేలు జమచేస్తామన్న వాగ్దానం కూడా సత్ఫలితాలిచ్చింది.

Updated Date - May 05 , 2026 | 07:20 AM