విద్యార్థుల నిరసనల్లో ఏకే-47తో కాల్పులు.. జిల్లా ఎస్పీ బదిలీ
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:06 PM
బిహార్‌లో నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లో కాల్పుల జరిపిన ఉదంతం కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లో కాల్పుల జరిపిన ఉదంతం కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శివాన్ జిల్లాలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఎస్పీ పురన్ కుమార్‌ను జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. మొత్తం 18 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
పురన్ కుమార్ ఝా స్థానంలో భరత్ సోనీ శివాన్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చెపట్టారు. భోజ్‌పూర్‌లో మరో కార్యకర్త ఎన్‌కౌంటర్‌తో కలకలం రేగడంతో జిల్లా ఎస్పీపై కూడా వేటు పడింది. భోజ్‌పూర్ బాధ్యతలను మరో అధికారి అవధేశ్ దీక్షిత్‌కు ప్రభుత్వం అప్పగించింది.
మరోవైపు, ఏకే-47తో కాల్పుల ఉదంతంపై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ పలు ప్రశ్నలు సంధించారు. విద్యార్థుల నిరసనను అదుపు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌కు ఏకే-47 ఎలా వచ్చిందని అన్నారు. ఏ ఆర్మరీ దీన్ని జారీ చేసిందని ప్రశ్నించారు.
విద్యార్థుల మధ్య చిక్కుకుపోయిన కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపాడని సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటనలో నాలుగు రౌండ్‌ల కాల్పులు జరిగాయని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని కూడా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. పోలీసు దౌర్జన్యంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా బిహార్ ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే, నిరసనల సందర్భంగా ఇతర చోట్ల కొందరు విద్యార్థులకు తూటాల కారణంగా స్వల్ప గాయాలయ్యాయని కూడా ప్రభుత్వం పేర్కొంది. హాథీ చౌక వద్ద రద్దీ నియంత్రణ కోసం ఒక ఎస్ఐ నీలేశ్ కుమార్ గాల్లోకి కాల్పులు జరిపారని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ