Share News

బీహార్‌లో సంచలనం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నిందితులు హతం!

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:45 PM

బీహార్‌లో సంచలనం సృష్టించిన పీఏసీఎస్ అధ్యక్షుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

బీహార్‌లో సంచలనం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నిందితులు హతం!
Bihar Police Encounter

ఇంటర్నెట్ డెస్క్: బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో తీవ్ర కలకలం రేపిన పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం) అధ్యక్షుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు.. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. మృతులను రాజేష్ శర్మ, బబ్లూ కుమార్, జేపీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. మనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్‌పూర్ గంగా ఘాట్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

నిందితుల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు అక్కడికి చేరుకోగా.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, నిందితులకు మధ్య సుమారు 20 నిమిషాల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇరువైపుల నుంచి దాదాపు 30 రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల శబ్దాలతో షేర్‌పూర్ గంగా ఘాట్ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.


ఎన్‌కౌంటర్‌లో మనేర్ ఎస్‌హెచ్‌ఓకు గాయాలు..

ఈ ఎదురుకాల్పుల్లో మనేర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) రజనీష్ కుమార్ కూడా తుపాకీ గుండు గాయానికి గురయ్యారు. కాల్పుల సమయంలో ఆయనకు బుల్లెట్ తగలడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పీఏసీఎస్ అధ్యక్షుడి హత్య కేసులో ఈ ముగ్గురు నిందితుల పాత్రపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టగా, వారిని పట్టుకునే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులు మృతి చెందడంతో ఈ హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకున్నట్లయింది. ఘ ఇరువైపుల నుంచి ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి, ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు ఏమిటి, హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పాట్నా జిల్లాలో భద్రతా చర్యలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు రూ.50 లక్షల టోకరా.. ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ మోసం

వయసు 27, క్రిమినల్‌ కేసులు 59

Updated Date - Nov 06 , 2026 | 02:02 PM