ఎంపీ పప్పూ యాదవ్ అరెస్టు.. తప్పుపట్టిన రాహుల్, ప్రియాంక
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:23 PM
పూర్ణియా పార్లమెంటు సభ్యుడు పప్పూ యాదవ్ ను పాట్నా పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు.1995 నాటి వివాదాస్పద భూముల కేసులో శుక్రవారం రాత్రి ఈ అరెస్టు జరిగింది.
పాట్నా: పూర్ణియా పార్లమెంటు సభ్యుడు పప్పూ యాదవ్ (Pappu Yadav)ను పాట్నా పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. 1995 నాటి వివాదాస్పద భూముల కేసులో శుక్రవారం రాత్రి ఈ అరెస్టు జరిగింది. పాత ఐపీసీ (ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత) సెక్షన్లు 419, 420, 468, 448, 506, 120B కింద ఆయనపై గర్దానీబాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు పాట్నా ఎస్‌పీ భానుప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, షెడ్యూల్ తేదీకి కోర్టు ముందు హాజరుకావడంలో ఎంపీ విఫలమయ్యారని, దీంతో ఈ అరెస్టు జరిగిందని చెప్పారు.
పప్పూయాదవ్‌కు వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు, ఒక కేర్‌టేకర్‌ను కూడా అనుమతించినట్టు సింగ్ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. ఆరుసార్లు ఎంపీగా ఉన్న రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూర్ణియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
రాహుల్, ప్రియాంక ఖండన
పప్పూయాదవ్ అరెస్టును లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. న్యాయం కోసం నిలబడే పప్పూ యాదవ్‌ను రాజకీయ కక్షతోనే అరెస్టు చేసినట్టు రాహుల్ ఆరోపించారు. నీట్ అభ్యర్థిని అనుమానాస్పద మృతిపై న్యాయం అడిగినందుకే ఆయన అరెస్టు జరిగిందన్నారు. జవాబుదారీతనాన్ని ప్రశ్నించిన వాళ్ల గొంతు నొక్కుతున్నారని, భయపెడుతున్నారని ఆరోపించారు. పప్పూ యాదవ్ అరెస్టును ప్రియాంక గాంధీ ఖండించారు. అన్యాయం, అణచివేతలకు పాల్పడటమే బీజేపీ, భాగస్వామ్య పార్టీల ఎజెండాగా మారిందన్నారు.
కాగా, నీట్ అభ్యర్థిని మరణంతో పప్పూ యాదవ్ తరచు జహనాబాద్ వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేవారు. పోలీసు విచారణను కూడా ఆయన బహిరంగంగానే ప్రశ్నించేవారు. తొలుత ఈ కేసుపై బిహార్ పోలీసులు 'సిట్'ను ఏర్పాటు చేశారు. అయితే కేసు అపరిష్కృతంగానే మిగిలిపోవడంతో సీబీఐకి బదిలీ చేశారు. అయితే సీబీఐ ఇంతవరకూ ఈ కేసుపై లాంఛనంగా ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు.
ఇవి కూడా చదవండి..
నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా ఆటకట్టు.. మూడు నౌకలు స్వాధీనం
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే