అరేబియా సముద్రంలో చమురు స్మగ్లింగ్.. ఆట కట్టించిన కోస్ట్ గార్డ్..
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:35 PM
చమురు అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకున్నారు. మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నట్టు తీరప్రాంత భద్రతా అధికారులు శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ముంబై: అరేబియా సముద్రంలో చమురు అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకున్నారు. మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నట్టు తీరప్రాంత భద్రతా అధికారులు శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో నడి సముద్రంలో ఈనెల 5-6 తేదీల్లో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్పారు.
అధికారుల సమాచారం ప్రకారం.. భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో అనుమానాస్పద కదలికను గుర్తించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓడల రాకపోకలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో మూడు నౌకలను అడ్డుకుని తనిఖీలు నిర్వహించడంతో చమురు స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న దేశాల నుంచి తక్కువ ధరకు చమురు సేకరించి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. అంతర్జాతీయ జలాల నుంచి మోటార్ ట్యాంకర్ ద్వారా చమురును తరలిస్తున్నారని, తద్వారా భారత్ తదితర తీరప్రాంత రాష్ట్రాలకు కస్టమ్స్ సుంకాలను ఎగ్గొడుతున్నారని అధికారులు తెలిపారు.
వివిధ దేశాల్లోని హ్యాండర్ల నెట్‌వర్క్ ద్వారా ఈ ముఠా స్మగ్లింగ్ జరుపుతోందని, ఎవరికీ పట్టుబడకుండా తరచూ ఓడల గుర్తింపులను మారుస్తోందని అధికారులు చెప్పారు. కాగా, పట్టుబడిన మూడు నౌకలను తదుపరి విచారణ కోసం ముంబైకి తరలిస్తున్నారు. లీగల్ చర్యల కోసం ఇండియన్ కస్టమ్స్, ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నట్టు అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్