Share News

ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి..

ABN , Publish Date - Jun 04 , 2026 | 07:36 AM

బిహార్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి..
Bihar hospital fire

పాట్నా, జూన్ 4: బిహార్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌ఫూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో గురువారం తెల్లవారుజామున 3.55 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 20 మంది దాకా పేషంట్లు ఉన్నారు. వారందరూ మంటల్లో చిక్కుకుపోయారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. లోపల ఉన్న వారిని బయటకు తీసుకువచ్చారు. వీరిలో ఇద్దరు అక్కడే చనిపోయారు. మిగిలిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.


అగ్నిమాపక శాఖ అధికారి రామ్ నివాస్ పాండే మాట్లాడుతూ.. ‘ఐసీయూ నుంచి 15 - 20 మందిని కాపాడాం. వారిలో ఇద్దరు అక్కడే చనిపోయారు. మిగిలిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించాము. వారి ఆరోగ్య పరిస్థితి గురించి మాకు అప్‌డేట్ లేదు’ అని తెలిపారు. ఈ సంఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ.. ‘అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 13 మంది ఉన్నారు. సీసీయూలో మరి కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. దర్యాప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

Updated Date - Jun 04 , 2026 | 08:40 AM